ప్రైవేటు ల్యాబ్స్‌లో కరోనా టెస్టుల ఫీజులో మార్పులు

ప్రైవేటు ల్యాబ్స్‌లో కరోనా టెస్టుల ఫీజులో మార్పులు

ప్రైవేటు ల్యాబ్స్‌, ఆస్పత్రుల్లో కరోనా టెస్టుల ఫీజులను తగ్గిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశమై ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టుల ధరల సవరణకు ప్రతిపాదించింది. ఈ ప్రపోజల్స్‌ను ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆమోదిస్తూ.. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం నుంచి ప్రైవేటు ల్యాబ్‌లకు పంపే శాంపిల్స్‌కు ఆర్టీపీసీఆర్ విధానంలో చేసే పరీక్షలకు రూ.2,250 చెల్లించేది. అయితే ఇప్పుడు ఆ రేటును 250 తగ్గించింది. ప్రభుత్వం నుంచి అందే ఒక్కో శాంపిల్స్‌కు రూ.2 వేలు చొప్పున చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే నేరుగా ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించి ఆర్టీపీసీఆర్ టెస్టు చేసేందుకు ప్రైవేటు ల్యాబ్స్ గరిష్ఠంగా రూ.3 వేల వరకు చార్జ్ చేయవచ్చని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అలాగే ర్యాపిడ్ యాంటీ జెన్ కిట్ల ద్వారా చేసే పరీక్షలకు రూ.700 వసూలు చేయాలని స్పష్టం చేసింది. అయితే ఈ ధరలు స్క్రీనింగ్, పీపీఈ కిట్లు అన్నింటికి కలిపి నిర్ధారించామని, అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ తెలిపింది.

85 వేలు దాటిన కరోనా కేసులు

కర్ణాటకలో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 5007 కొత్త కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఒక్క రోజులో 110 మంది కరోనా కారణంగా మరణించారని తెలిపింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 85,870కి చేరగా.. 1724 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. కరోనా నుంచి 31,355 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 52,791 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది.