
- రూ. 60 లక్షల విలువైన 164 కేజీల గంజాయి స్వాధీనం
బషీర్‌బాగ్, వెలుగు : గంజాయి తరలిస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాల్ చెప్పారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ సీసీఎస్ ఆఫీస్‌లో ఆదివారం నిర్వహించిన మీటింగ్‌లో కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పిట్లం కోరంపల్లి తండాకు చెందిన ధరావత్ రవి గతంలో ఎన్డీపీఎస్ కేసులో మహారాష్ట్రలో అరెస్ట్ అయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చాక తన ఫ్రెండ్స్ అయిన సయ్యద్, ఆనంద్‌తో కలిసి గంజాయి అమ్మేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఒడిశాలోని ముచుంపుట్‌కు చెందిన గోవింద్ అనే వ్యక్తి వద్ద 100 కిలోల గంజాయి కొనుగోలు చేశాడు.
వాటిని 32 ప్యాకెట్లుగా చేసి హ్యుందాయ్ ఎక్సెంట్ కారులో హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, హుమాయున్ నగర్ పోలీసులు పారామౌంట్ కాలనీ వద్ద ముగ్గురిని పట్టుకొని 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే భవానీ నగర్ పీఎస్ పరిధిలో మరో కేసులో 64 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని అసిఫ్‌నగర్‌కు చెందిన షేక్ పర్వేజ్‌పై ఏపీలోని రావులపాలెం, హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో ఎన్డీపీఎస్ కేసులుఉన్నాయి. రావులపాలెం కేసులో అరెస్ట్ అయి కొన్ని రోజురు రాజమండ్రి జైలులో ఉన్నాడు.
ఈ టైంలో ఒడిశాలోని కలిమెల ప్రాంతానికి చెందిన గంజాయి రైతు దీపక్‌తో పరిచయం ఏర్పడింది. ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదల అయ్యాక ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో గంజాయి అమ్మేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఒడిశాకు చెందిన దీపక్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో గంజాయిని హైదరాబాద్‌కు తెప్పించాడు. సమాచారం అందుకున్న భవానీనగర్ పోలీసులు షేక్ పర్వేజ్, అతడి ఫ్రెండ్ అబ్దుల్ రవూఫ్‌తో పాటు దీపక్‌ను అరెస్ట్ చేశారు. రెండు కేసుల్లో కలిసి రూ. 60 లక్షల విలువైన 164 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు డీసీపీ చెప్పారు.