టీసీఎస్​ లాభం రూ.11,342 కోట్లు

టీసీఎస్​ లాభం  రూ.11,342 కోట్లు
  • రూ.17 వేల కోట్ల విలువైన బైబ్యాక్​ ప్రకటన
  • షేరుకు రూ.9 చొప్పున ఇంటెరిమ్ ​డివిడెండ్​

న్యూఢిల్లీ: ఐటీ సర్వీసెస్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో రూ.11,342 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్)​ సంపాదించింది. వార్షికంగా ఇది 8.7శాతం వృద్ధికి సమానం. గత ఏడాది రెండో క్వార్టర్​లో కంపెనీ రూ.10,431 కోట్ల లాభాన్ని ప్రకటించింది.  కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.59,692 కోట్లకు చేరుకుంది. ఇది 2022 రెండో క్వార్టర్​లో వచ్చిన రూ.55,309 కోట్లతో పోలిస్తే దాదాపు 8శాతం పెరిగింది. 

మొత్తం ఆదాయం సంవత్సరానికి దాదాపు 8శాతం పెరిగి రూ.60,698 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ మార్జిన్  వార్షికంగా 0.3 శాతం పెరిగి 24.3శాతానికి చేరుకుంది. 2024 ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​లో టీసీఎస్​ ఆర్డర్ బుక్​ విలువ 11.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈసారి భారీ డీల్స్​ చాలా సాధించామని టీసీఎస్  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,  మేనేజింగ్ డైరెక్టర్ కృతివాసన్​ అన్నారు. నిలకడమైన కరెన్సీ  పరంగా, టీసీఎస్  రెండో క్వార్టర్​ ఆదాయం వార్షికంగా 2.8శాతం పెరిగింది. 

మాన్యుఫాక్చరింగ్ వర్టికల్​​5.8శాతం, లైఫ్ సైన్సెస్  హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్ 5శాతం,  యుటిలిటీలు 14.8శాతం, బీఎఫ్​ఎస్​ఐ -0.5శాతం, కమ్యూనికేషన్స్, మీడియా -2.1శాతం, కన్జూమర్ బిజినెస్ గ్రూప్ (సీబీజీ) 1 శాతం,  టెక్నాలజీ, సేవల వర్టికల్​ -2.2శాతం పెరిగాయి.

యూఎస్​ నుంచి రెవెన్యూ 10 శాతం అప్‌‌‌‌​

ప్రధాన మార్కెట్లలో రెవెన్యూ అంటే యునైటెడ్ స్టేట్స్ లో 10.7శాతం, యునైటెడ్ కింగ్‌‌‌‌‌‌‌‌డమ్ 1.3శాతం,  ఉత్తర అమెరికా 0.1శాతం పెరిగాయి. భారతదేశ  మార్కెట్​ 3.9శాతం పెరిగింది. ఆసియా పసిఫిక్ 4.1శాతం విస్తరించింది. లాటిన్ అమెరికా 13.1శాతం లాభపడింది.   

మిడిల్ ఈస్ట్,  ఆఫ్రికా  15.9శాతం వృద్ధి చెందాయి. ఇదిలా ఉంటే ఈక్విటీ షేరుకు రూ.9 చొప్పున రెండవ మధ్యంతర డివిడెండ్​ను​ టీసీఎస్​ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది.  అంతేగాక ఒక్కో షేరుకు రూ.4,150 చొప్పున రూ.17 వేల కోట్ల  వరకు షేర్ బైబ్యాక్‌‌‌‌‌‌‌‌ ప్రపోజల్​ను కంపెనీ ఆమోదించింది.