
భారత ప్రభుత్వం జీఎస్టీ రేట్ల తగ్గింపుల గురించి కీలక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో కార్ల తయారీ సంస్థలు కూడా పండక్కి తమ వివిధ కార్ మోడళ్లపై భారీగా తగ్గింపులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్, మారుతీ వంటి సంస్థలు దసరా, దీపావళి అమ్మకాలను టార్గెట్ చేస్తూ తగ్గింపుల గురించి ప్రకటనలు చేస్తున్నాయి. తగ్గిన జీఎస్టీ బెనిఫిట్స్ నేరుగా కస్టమర్లకు అందించటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది.
మార్చిన జీఎస్టీ రేట్లకు అనుగుణంగా కొత్త తగ్గించిన రేట్లను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్ సి. భార్గవ చెప్పారు. చాలా కాలంగా చిన్న కార్ల అమ్మకాలు తగ్గటాన్ని చూశామని అయితే రేట్ల తగ్గింపు వల్ల ఈ ఏడాది స్మాల్ కార్ల అమ్మకాలు 10 శాతం పెరుగుతాయని అంచనాలను పంచుకున్నారు. ఈ క్రమంలో మారుతీ ఆల్టో రేటు రూ.50వేల వరకు తగ్గొచ్చన్న భార్గవ.. వేగనార్ ఆర్ రేటు రూ.67వేల వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
ALSO READ : మోడీ మా మిత్రుడే..
ఇదే క్రమంలో టాటా మోటార్స్ కూడా కస్టమర్లకు భారీ సేవింగ్స్ మోడళ్ల వారీగా ప్రకటించింది. దీంతో టియాగోపై రూ.75వేలు, ఆల్ట్రోజ్ పై రూ.లక్ష 10వేలు, పంచ్ పై రూ.85వేలు, నెక్సన్ పై రూ.లక్ష 55వేలు, టాటా హారియర్ పై రూ.లక్ష 40వేలు.., ఇక చివరిగా టాటా సఫారీ కార్ల రేటు రూ.లక్ష 45వేల వరకు తగ్గనున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో టిగర్, కర్వ్ మోడళ్లపై కూడా ఆకర్షనీయమైన తగ్గింపులు ఉంటాయని కంపెనీ చెబుతోంది.
సరైన సమయంలో మోడీ సర్కార్ జీఎస్టీ సంస్కరణలతో ముందుకొచ్చిందని టాటా మోటార్స్ పాసింజర్ వాహనాలు ఎండీ షైలేష్ చంద్ర వెల్లడించారు. ఇదే సమయంలో 350 సీసీ కంటే తక్కువ ఇంజిన్ కెపాసిటీ కలిగిన టూవీలర్ల రేట్లను కూడా తగ్గించేందుకు కంపెనీలు ముందుకొస్తున్నాయి. మెుత్తానికి ఈ సారి పండుగ అమ్మకాలు దుమ్ముదులిపేస్తాయని ఆటో రంగం నిపుణులు అంటున్నారు.