- క్యూ4 లో రూ.17,407 కోట్ల నికర లాభం సాధించిన కంపెనీ
న్యూఢిల్లీ : టాటా మోటార్స్ అదరగొట్టింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్ (క్యూ4) లో కంపెనీ నెట్ ప్రాఫిట్ (కన్సాలిడేటెడ్) మూడు రెట్లకు పైగా పెరిగి రూ.17,407.18 కోట్లకు చేరుకుంది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో రూ. 5,407.79 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కిందటేడాది డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) లో వచ్చిన రూ.11,666.07 కోట్లతో పోలిస్తే కంపెనీ ప్రాఫిట్ మార్చి క్వార్టర్‌లో 49 శాతం వృద్ధి చెందింది. టాటా మోటార్స్ రెవెన్యూ క్యూ4 లో 13.5 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగి రూ. 1.05 లక్షల కోట్ల నుంచి రూ. 1.19 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో డొమెస్టిక్ మార్కెట్‌లో 76,399 బండ్లను కంపెనీ విక్రయించింది. ఇవి కిందటేడాది ఏప్రిల్‌లో అమ్మిన 68,514 బండ్లతో పోలిస్తే 12 శాతం ఎక్కువ. టాటా మోటార్స్ సబ్సిడరీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) రికార్డ్ ప్రాఫిట్‌ను ప్రకటించింది. ఈ కంపెనీ రెవెన్యూ మార్చి క్వార్టర్‌లో 7.9 బిలియన్ పౌండ్ల (రూ.83 వేల కోట్ల) కు పెరిగింది. 2023–24 లో 29 పౌండ్ల (రూ.3 లక్షల కోట్ల) రెవెన్యూని కంపెనీ సాధించింది. పూర్తి ఏడాదికి గాను జేఎల్‌ఆర్‌కు ఇదే అత్యధిక రెవెన్యూ. టాటా మోటార్స్ షేర్లు శుక్రవారం 1.62 శాతం పెరిగి రూ.1,047 దగ్గర ముగిశాయి. 2023–24 కి గాను ఒక్కో షేరుకి రూ.3 స్పెషల్ డివిడెండ్, రూ.3 సాధారణ డివిడెండ్‌ను ఇవ్వాలని కంపెనీ నిర్ణయించుకుంది.
సిప్లా లాభం రూ. 931.87 కోట్లు
ఫార్మా కంపెనీ సిప్లాకు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్‌లో నికర లాభం (కన్సాలిడేటెడ్) 78.7 శాతం పెరిగి రూ. 931.87 కోట్లకు చేరుకుంది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో రూ. 521.51 కోట్ల లాభం వచ్చింది. ఇదేకాలంలో మొత్తం ఆదాయం రూ. 5,739.3 కోట్ల నుంచి రూ. 6,163.24 కోట్లకు పెరిగింది. మొత్తం ఖర్చులు రూ. 4,946.14 కోట్ల నుంచి రూ. 5,153.31 కోట్లకు పెరిగాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం రూ. 4,153.72 కోట్లుగా ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 2,832.89 కోట్లు వచ్చాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ. 2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు రూ.13 తుది డివిడెండ్‌ను సిఫార్సు చేసింది.
