న్యూఢిల్లీ: టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) మార్కెట్లో తన సత్తా చాటుతోంది. గత ఆరు నెలల్లోనే ఈవీల బుకింగ్స్లో ఏకంగా మూడు రెట్ల వృద్ధి నమోదు చేసింది. డిమాండ్ భారీగా ఉన్నా, ఉత్పత్తి సామర్థ్యం దానిని అందుకోలేకపోతోందని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స వెల్లడించారు.
గత రెండు, మూడు నెలలుగా కంపెనీ ప్రతినెలా మార్కెట్ వాటాను పెంచుకుంటూ వచ్చిందని, రెండో స్థానంలో ఉన్న ప్రత్యర్థి సంస్థతో పోలిస్తే తమ ఆధిక్యం మరింత పెరిగిందని స్పష్టం చేశారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు జూన్ క్వార్టర్లో ఏడాది లెక్కన 46శాతం వృద్ధిని సాధించగా, ఈవీ విభాగం ఏకంగా 77శాతం వృద్ధి చెందిందని తెలిపారు.
జులై, ఆగస్టు నెలల్లోనూ ఇదే ఊపు కొనసాగడంతో రానున్న పండుగల సీజన్ ఈవీ పరిశ్రమ చరిత్రలోనే అతిపెద్ద త్రైమాసికంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. బండ్ల తయారీ సంస్థలు రేట్లు పెంచుతున్నా, జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావం ఇప్పటికీ వినియోగదారులకు అనుకూలంగా ఉందని వివేక్ అభిప్రాయపడ్డారు.
