- ఆగస్టులో రూ.7,541 కోట్ల రాబడి
- గతేడాదితో పోలిస్తే 18.7 శాతం వృద్ధి
- దేశంలో తెలంగాణకు 3వ స్థానం
- బోగస్ ఐటీసీ క్లెయిమ్‌లకు చెక్
- జీఎస్టీలో హైదరాబాద్‌దే లయన్ షేర్
- పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణతో ఫలితాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వాణిజ్య పన్నుల రాబడి రికార్డు స్థాయిలో పుంజుకుంటోంది. ఆర్థిక ఒడిదుడుకులు, సంక్షేమ పథకాల వ్యయాల మధ్య వాణిజ్య పన్నుల శాఖ సాధిస్తున్న ఆదాయం రాష్ట్ర ఖజానాకు ఊరటనిస్తోంది. గత ఆగస్టులో జీఎస్టీ, పెట్రోల్, మద్యం వ్యాట్ రూపంలో ప్రభుత్వానికి రూ.7,541 కోట్ల పన్నుల రాబడి సమకూరింది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 18.7 శాతం వృద్ధి సాధించింది. వరుసగా జులై, ఆగస్టు నెలల్లో పన్నుల వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు తొలి ఐదు నెలల్లో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం 16 శాతం పెరిగి రూ.37,052 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో రూ.31,901 కోట్లు సమకూరగా, ఈసారి రూ.5,151 కోట్లు అధికంగా వచ్చాయి.
ప్రధాన ఆర్థిక వనరుగా జీఎస్టీ
రాష్ట్ర పన్నుల వసూళ్లలో జీఎస్టీ ప్రధాన వనరుగా నిలుస్తోంది. గతేడాది ఆగస్టులో జీఎస్టీ ద్వారా రూ.3,641 కోట్లు రాగా, ఈసారి రూ.4,348 కోట్లు సమకూరాయి. ఇది 19 శాతం వృద్ధి. జీఎస్టీ వృద్ధి రేటులో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో అసోం, ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పన్ను వసూళ్లలో లొసుగులను సరిదిద్దడం, వ్యవస్థాగత లోపాలను అరికట్టడంతో రాబడి పెరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా జరిగే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) బోగస్ క్లెయిమ్‌లను గుర్తించి అడ్డుకోవడంతో ఆదాయం పెరిగింది.
జీఎస్టీతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, మద్యం అమ్మకాలపై వచ్చే వ్యాట్ వసూళ్లు కూడా ఖజానాకు దన్నుగా నిలిచాయి. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ఆదాయం గతేడాది ఆగస్టులో రూ.1,395 కోట్లు కాగా, ఈసారి 20 శాతం పెరిగి రూ.1,678 కోట్లకు చేరింది. మద్యం వ్యాట్ ఆదాయం రూ.1,317 కోట్ల నుంచి 15 శాతం పెరిగి రూ.1,515 కోట్లకు చేరింది. ప్రొఫెషనల్ ట్యాక్స్ మాత్రం రూ.78 కోట్ల నుంచి 8 శాతం తగ్గి రూ.72 కోట్లకు పరిమితమైంది. ఏప్రిల్–ఆగస్టు మధ్య పెట్రోల్ వ్యాట్ 13 శాతం, మద్యం వ్యాట్ 11 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఇదే కాలంలో జీఎస్టీ ఆదాయం రూ.17,415 కోట్ల నుంచి రూ.20,860 కోట్లకు పెరిగి 20 శాతం వృద్ధి సాధించింది.
హైదరాబాద్ నుంచే 91 శాతం రాబడి..
రాష్ట్ర జీఎస్టీ రాబడిలో గ్రేటర్ హైదరాబాద్ కీలకంగా నిలిచింది. రాష్ట్రంలో నమోదైన 5.8 లక్షల జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల్లో 69 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆగస్టులో రాష్ట్రానికి వచ్చిన మొత్తం జీఎస్టీ రాబడిలో హైదరాబాద్ వాటా 91.1 శాతంగా (రూ.3,956 కోట్లు) నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన రూ.700 కోట్ల జీఎస్టీ రాబడిలో 96.3 శాతం హైదరాబాద్ నుంచే రావడం గమనార్హం. గతేడాది ఆగస్టులో నగర జీఎస్టీ రూ.3,282 కోట్లు కాగా, ఈసారి 20.53 శాతం పెరిగింది. రాష్ట్రంలో ఒక్కో పన్ను చెల్లింపుదారుడి సగటు రాబడి రూ.74,845 కాగా, హైదరాబాద్‌లో రూ.98,900గా ఉంది. ఐటీ, ఫార్మా, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాలు రాజధానిలో కేంద్రీకృతమై ఉండటంతో ఏప్రిల్–ఆగస్టు మధ్య నగర జీఎస్టీ 21.60 శాతం పెరిగి రూ.18,892 కోట్లకు చేరింది.
యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించడంతో..
పన్ను చెల్లింపుదారులకు సేవలను మెరుగుపరచడంతో పాటు వసూళ్ల సామర్థ్యాన్ని పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖ క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించింది. పట్టణ, గ్రామీణ ఆర్థిక ముఖచిత్రానికి అనుగుణంగా కోర్ అర్బన్ ఎకానమీ పరిధిలో 12 డివిజన్లు, 78 సర్కిళ్లు, పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ఒక డివిజన్, 5 సర్కిళ్లు, రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ పరిధిలో 6 డివిజన్లు, 38 సర్కిళ్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అగ్రశ్రేణి 400 భారీ వ్యాపార సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ‘లార్జ్ ట్యాక్స్‌పేయర్ యూనిట్’ను ఏర్పాటు చేశారు. ఈ పరిపాలనా సంస్కరణలు, డేటా అనలిటిక్స్ ఆధారిత నిఘాతో పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేసి ఆదాయాన్ని మరింత పెంచాలని శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
