న్యూఢిల్లీ: కమర్షియల్ వెహికల్స్ (సీవీ), ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) వ్యాపారాలను రెండు వేర్వేరు లిస్టెడ్ సంస్థలుగా విడదీయాలని నిర్ణయించామని టాటా మోటార్స్ లిమిటెడ్ (టీఎంఎల్) స్టాక్ ఎక్స్ఛేంజీలకు సోమవారం తెలియజేసింది. విభజన నిర్ణయాన్ని 2022లోనే తీసుకున్నారు. దీని వల్ల రెండు సంస్థలూ అధిక సామర్థ్యంతో పనిచేస్తాయని, అధిక వృద్ధి సాధ్యమవుతుందని కంపెనీ తెలిపింది.
ఇటీవలి సంవత్సరాలలో, టాటా మోటార్స్ సీవీ, ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ+ఈవీ), జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) వ్యాపారాలు విభిన్న వృద్ధి వ్యూహాలను అమలు చేశాయి. 2021 నుంచి, ఈ వ్యాపారాలు వారి సంబంధిత సీఈఓల కింద స్వతంత్రంగా పనిచేస్తున్నాయని టాటా మోటార్స్ తెలిపింది. బీఎస్‌ఈలో సోమవారం టాటా మోటార్స్ స్క్రిప్ 0.12 శాతం నష్టంతో రూ.987 వద్ద ముగిసింది. విభజన ఎన్‌సీఎల్‌టీ స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్ ద్వారా అమలవుతుంది. టీఎంఎల్, అందరు షేర్‌హోల్డర్లకు రెండు లిస్టెడ్ ఎంటిటీలలో సమాన వాటాలు ఉంటాయని ఈ కార్‌మేకర్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. డీమెర్జర్ పనులు పూర్తి కావడానికి వాటాదారుల, రుణదాతల, నియంత్రణ ఆమోదాలు తీసుకోవాల్సి ఉంటుంది.
విభజనను పూర్తి చేయడానికి మరో 12–-15 నెలల సమయం పడుతుంది." ఈరోజు (సోమవారం) జరిగిన సమావేశంలో టీఎంఎల్ డైరెక్టర్ల బోర్డు, టాటా మోటార్స్ లిమిటెడ్‌ను రెండు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విభజించే ప్రతిపాదనను ఆమోదించింది. వాణిజ్య వాహనాల వ్యాపారం దాని సంబంధిత పెట్టుబడులు ఒక సంస్థ అవుతుంది. పీవీ, ఈవీ, జేఎల్ఆర్ సహా ప్యాసింజర్ వెహికల్స్ వ్యాపారాలు మరొక సంస్థ అవుతుంది అని కంపెనీ తెలిపింది.
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. ''గత కొన్నేళ్లుగా టాటా మోటార్స్ బలమైన వృద్ధి సాధించింది. మూడు ఆటోమోటివ్ వ్యాపార యూనిట్లు ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. స్థిరమైన పనితీరును అందిస్తున్నాయి. ఈ విభజన మార్కెట్ అందించిన అవకాశాలను బాగా ఉపయోగించుకోవడంలో వాటికి సహాయపడుతుంది. కస్టమర్లకు, ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుంది. ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు”అని అన్నారు.
