తవాంగ్ ఘటనపై ఉభయసభల్లో గందరగోళం

తవాంగ్ ఘటనపై ఉభయసభల్లో గందరగోళం

తవాంగ్ ఘర్షణపై పార్లమెంట్ ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఘటనపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే తవాంగ్ ఇష్యూపై సమగ్ర చర్చకు సభాపతి అనుమతించలేదు. ఈ అంశంపై ప్రతిపక్షాలు నోటీసులు ఇవ్వలేదని..చర్చకు అనుమతించేది లేదని చైర్మన్ తెలిపారు. దీంతో రాజ్యసభ నుంచి 17 పార్టీలు వాకౌట్ చేశాయి. తాము దేశానికి, సైన్యానికి అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. తవాంగ్ ఘటనపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

నిర్మలా సీతారామన్

ఇతర దేశాల కరెన్సీతో పోల్చితే భారత రూపాయి బలపడుతోందని లోక్ సభలో నిర్మలా సీతారామన్ తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని కేంద్రం మరింత తగ్గిస్తోందని చెప్పారు. నిత్యావసర వస్తువుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం గమనిస్తోందన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ లో 11నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందన్నారు. ప్రధానంగా ఆహార వస్తువుల ధరలు తగ్గించడం ద్వారా జీడీపీలో 6.4 శాతం ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు. 

నితిన్ గడ్కరీ

ఈ ఆర్థిక సంవత్సరంలో 438 జాతీయ రహదారులు పూర్తవుతాయని రాజ్యసభలో మంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 268 ప్రాజెక్టుల పనుల్లో నిధుల కొరతతో జాప్యం జరుగుతోందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. కొన్ని రాష్ట్రాల్లో భూసేకరణ ఆలస్యం కారణంగా ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. 

అశ్విని వైష్ణవ్

కొన్ని రాజకీయ పార్టీల కారణంగా BSNL తీవ్రంగా నష్టపోయిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. బీఎస్ఎన్ఎల్ పునరుద్దరణ కోసం రూ.లక్షా 64 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టుకు మోడీ ఆమోదం తెలిపారన్నారు. ఇది టెలికాం PSUని పూర్తిగా మారుస్తుందన్నారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సంస్థ సంక్షోభ దశలో ఉందన్నారు..యూపీఏ హయాంలోనే దీన్ని నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మంత్రి ప్రకటనపై విపక్షాలు సభలో నిరసన తెలియజేశాయి.

జితేంద్ర సింగ్ 

కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో దాదాపు 9 లక్షల 79 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని లోక్ సభకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఖాళీల భర్తీ నిరంతర ప్రక్రియ అన్నారు. ఇటు సివిల్ సర్వీస్ లో 1472 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 2020 నుంచి జమ్మూకాశ్మీర్ లో తొమ్మిది మంది కాశ్మీరీ పండిట్లు హత్యకు గురయ్యారని మరో మంత్రి నిత్యానందరాయ్ చెప్పారు.

యూపీలోని కొన్ని ప్రాంతాల్లో గోండు సామాజిక వర్గాన్ని ఎస్టీ కేటగిరిలో చేర్చే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఉత్తరప్రదేశ్ కు వర్తించే విషయంలో రాజ్యాంగ షెడ్యూల్ తెగలు, రాజ్యాంగ షెడ్యూల్ కులాల ఆర్డర్ లను సవరించింది.