
ఢిల్లీ: భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలంటే ఇకపై ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ఈ ప్రచారంపై వివరణ ఇచ్చింది. ఇండియా నుంచి విద్య, ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లే ప్రతీ ఒక్కరూ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ చూపించి, సెక్షన్ 230 సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తీవ్ర ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు, ఆర్థిక నేరాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని వివరణ ఇచ్చింది. నల్ల ధన నిర్మూలన చట్టం కింద భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రతీ ఒక్కరూ ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించాల్సిందేనని కేంద్ర బడ్జెట్ అనంతరం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ వివరణ ఇచ్చింది.
ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొన్న వారితో పాటు రూ.10 లక్షలకు మించి ట్యాక్స్ బకాయిలు పెండింగ్లో ఉన్న వాళ్లు కూడా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాతే దేశం దాటి వెళ్లేందుకు అనుమతి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. Income-tax Act, the Wealth-tax Act, 1957, the Gift-tax Act, 1958, or the Expenditure-tax Act, 1987 ప్రకారం ఎలాంటి బకాయిలు పెండింగ్లో లేకపోతేనే ఆదాయపు పన్ను శాఖ సదరు వ్యక్తికి ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తుంది. ఈ సర్టిఫికెట్ను పరిశీలించాక సంతృప్తికరంగా అనిపిస్తేనే విదేశాలకు వెళ్లేందుకు అనుమతి పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం సదరు వ్యక్తులు వెల్లడించే బకాయిలు, అప్పులు నల్ల ధన చట్టం పరిధిలో లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి.