వరుస పెట్టి పన్నులు.. చార్జీల మోత

వరుస పెట్టి పన్నులు.. చార్జీల మోత
  • ఏడునెలల్లో రెండుసార్లు పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు
  • డబుల్​ అయిన కరెంట్​ బిల్లులు
  • అడ్డగోలుగా బస్సు టికెట్​ రేట్లు.. త్వరలో మరో 30% పైగా పెంపు
  • 40% పెరిగిన ఆర్టీఏ ట్యాక్స్​లు 

రాష్ట్ర ప్రభుత్వం వరుస పెట్టి పన్నులు, చార్జీల మోత మోగిస్తున్నది. ఇప్పటికే భగ్గుమంటున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం.. ఈ పన్నుల బాదుడుకు  మరింత ఆగమైతున్నారు. మొన్నామధ్య రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింతలు చేసిన ప్రభుత్వం.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కరెంటు బిల్లులు కూడా డబుల్ చేసింది. ఆర్టీసీ బస్ చార్జీలు అమాంతం పెంచేసింది. ఇటీవల వాహనదారుల నడ్డి విరిచేలా ఆర్టీఏ ట్యాక్స్​లనూ పెంచింది. నిరుపేదలను కూడా వదలకుండా చార్జీల మోత మోగిస్తున్నది. ఇలా పెరిగిన అన్ని పన్నులు, చార్జీల వల్ల జనంపై దాదాపు రూ.16 వేల కోట్ల భారం పడుతున్నది. 

హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్​ చార్జీల నుంచి ఆర్టీఏ ట్యాక్స్​ల దాకా ఒకదాని వెనుక ఒకటిగా జనంపై సర్కారు భారం మోపుతున్నది. మొన్నటిదాకా కట్టిన చార్జీలు ఒక్కసారిగా డబుల్​ అవడంతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. ఇప్పటికే సెస్​లు, రౌండ్​ ఫిగర్​ పేరిట బస్సు కిరాయిలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. మళ్లీ టికెట్​ రేట్లు 30% పెంచేందుకు రెడీ అవుతున్నది. ఉద్యోగుల జీతాలకు కూడా కటకట మొదలు కావడంతో జనంపై పన్నులు బాదుతున్నది. పెంచిన చార్జీలకు సంబంధించి కొన్నింటికి ఉత్తర్వులు జారీ చేసి.. మరికొన్నింటిని రహస్యంగా అమలు చేస్తున్నది.
కరెంటు బిల్లులు చూస్తే షాకే
డిస్కంలు నష్టాల్లో ఉన్నాయంటూ కరెంటు చార్జీల పెంపుతో జనాలకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌‌  ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​(ఈఆర్సీ)కు విద్యుత్‌‌‌‌‌‌‌‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రతిపాదనలు పంపడంతో హియరింగ్‌‌ నిర్వహించి ఫైనల్‌‌ చేశారు. డొమెస్టిక్  కేటగిరీలో యూనిట్‌‌కు 50 పైసలు, 44 లక్షల మంది కమర్షియల్‌‌‌‌‌‌‌‌, ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ వినియోగదారులపై యూనిట్‌‌‌‌‌‌‌‌కు రూపాయి చొప్పున చార్జీలు పెంచారు. డైరెక్ట్ , హిడెన్ చార్జీలతో కలిపి బిల్లులు డబుల్‌‌ అయ్యాయి. మొన్నటి దాకా రూ. 500 వచ్చే బిల్లు వెయ్యికి పెరిగింది. కరెంట్ చార్జీల పెంపుతో ప్రజలపై ఏటా రూ. 5,596 కోట్ల భారం పడనుంది.
రెండు సార్లు పెరిగిన రిజిస్ట్రేషన్‌‌‌‌ చార్జీలు
రాష్ట్ర ప్రభుత్వం ఏడునెలల్లో రెండు సార్లు రిజిస్ట్రేషన్  చార్జీలు పెంచింది. నిరుడు జులై 22న రిజిస్ట్రేషన్​, మ్యుటేషన్​ చార్జీలు, మార్కెట్​ విలువలు పెంచింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్​ విలువలు మరోసారి పెంచింది. దీంతో అగ్రికల్చర్‌‌‌‌ ల్యాండ్‌‌‌‌ విలువ కనిష్టంగా 50 శాతం, గరిష్టంగా 150 శాతం దాకా పెరిగింది. నాన్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ ఆస్తుల విలువ 25 శాతం, ఓపెన్‌‌‌‌ ప్లాట్ల విలువ 35 శాతం వరకు పెరిగింది. ఎకరాకు రూ. 10 లక్షలుండే  మార్కెట్​ విలువ ఇప్పుడు రూ. 20 లక్షలు అయ్యింది. గతంలో రిజిస్ట్రేషన్  చార్జీలు రూ. లక్ష వరకు ఉంటే ఇప్పుడు రూ. 2.5 లక్షలకు చేరింది. దీంతో జనాలు ఇండ్లు, స్థలాలు కొనాలంటేనే జంకుతున్నారు. రెండుసార్లు పెంచిన చార్జీలతో ఏటా సుమారు రూ. 8 వేల కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
ఆర్టీఏలో ట్యాక్స్‌‌‌‌ల వాత
ఆర్టీఏ ద్వారా కూడా జనంపై సర్కారు భారం మోపింది.  లైఫ్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌, క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌, గ్రీన్‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌ పెంచేసింది. మొత్తంగా 30 నుంచి 40 శాతం దాకా ట్యాక్స్‌‌‌‌లు బాదేసింది. లైఫ్ ట్యాక్స్.. టూవీలర్ పై రూ. 3వేలు, ఫోర్ వీలర్ పై రూ. 80 వేల దాకా, టెన్ సీటర్ బండ్లపై రూ. 1.20 లక్షల వరకు అదనంగా పెంచింది. ఇది వరకు రూ. 11 లక్షల విలువైన కారు తీసుకుంటే ట్యాక్స్‌‌‌‌తో కలిపి రూ. 12 లక్షల దాకా అయ్యేది. ఇప్పుడు రూ. 12.5 లక్షలు అవుతున్నది. ఇక గ్రీన్ ట్యాక్స్ ఇప్పటిదాకా రూ. వెయ్యిలోపే ఉండగా, రూ. 4 వేల నుంచి 6 వేలకు పెంచారు. క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌ 25శాతం దాకా బాదారు.  ట్రావెల్స్ టెన్ సీటర్ బండికి ఇప్పటి దాకా రూ. 20 వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 25 వేలకు పెరిగింది. మొత్తంగా అన్ని రకాల ట్యాక్స్‌‌‌‌లతో సంవత్సరానికి వాహనదారులు, ట్రావెల్స్‌‌‌‌ యజమానులపై రూ. రెండు వేల కోట్ల అదనపు భారం పడనుంది.
సెస్‌‌‌‌ల పేరుతో బస్​ చార్జీల్లో బాదుడు
ఆర్టీసీ బస్సు ప్రయాణికులపై సంస్థ చార్జీల మోత మోగించింది. సైలెంట్​గా వివిధ రకాల పేర్లతో టికెట్‌‌‌‌ చార్జీలు పెంచింది. డీజిల్‌‌‌‌ రేట్ల పెంపు, నష్టాల పేరు చెప్పి ప్యాసింజర్‌‌‌‌పై భారం మోపుతున్నది. ప్యాసింజర్ సెస్, డీజిల్ సెస్, సేఫ్టీ సెస్ అంటూ 30 శాతం దాకా పెంచింది. దీనికి అదనంగా రౌండ్​ ఫిగర్‌‌‌‌ అంటూ వడ్డించింది. సుమారు ఒక్కో టికెట్‌‌‌‌పై రూ.10 నుంచి రూ.30 దాకా బాదుతున్నది. హైదరాబాద్ నుంచి నల్గొండ కు డీలక్స్‌‌‌‌ బస్సు కిరాయి గతంలో రూ.120 ఉండగా.. ఇప్పుడు 145 అయ్యింది. బస్‌‌‌‌పాస్‌‌‌‌లపై కూడా భారీగా భారం మోపింది. పాస్‌‌‌‌ను బట్టి రూ.100 నుంచి రూ. 500 పెంచింది. మొత్తంగా బస్సు టికెట్​, బస్సు పాసు చార్జీల పెంపుతో ఆర్టీసీకి ఏటా వెయ్యి కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది. ఇదిలా ఉండగా.. బస్సు చార్జీల మోత అసలైంది ముందుంది. త్వరలో 30 శాతానికి పైగా టికెట్‌‌‌‌ రేట్లు పెంచేందుకు సీఎం దగ్గరికి ఫైల్​ చేరింది. ఏ క్షణమైనా ఇది అమల్లోకి వచ్చే 
అవకాశం ఉంది. 

రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.లక్ష దాటినయ్​
మేం 150 గజాల ప్లాట్ కొని అగ్రిమెంట్ చేసుకునే సమయానికే ప్రభుత్వం రెండోసారి మార్కెట్ వ్యాల్యూ పెంచింది. మేం కొన్న ఏరియాలో గజం మార్కెట్ వ్యాల్యూ ఏడాది కింద రూ. 6 వేలు ఉండేదట. ఇప్పుడు అది రెండుసార్లు పెరిగి రూ.9,500 అయ్యింది. అప్పట్లో ఇదే ఏరియాలో మాకు తెలిసినవాళ్లు ప్లాట్ కొంటే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు కలిపి రూ.70 వేలు ఖర్చయింది.  ఇప్పుడు మాకు రూ. లక్షా 10 వేలు దాటింది. చార్జీలు, మార్కెట్ వ్యాల్యూ పెరగడం వల్ల మేం రూ. 40 వేలు అదనంగా చెల్లించాం. - ఎన్.సాహితి, టీచర్స్ కాలనీ, హన్మకొండ

ట్యాక్స్​లు తగ్గించాలె
కరోనా సమయంలో ప్రైవేట్‌‌‌‌ ట్రావెల్స్‌‌‌‌ ఓనర్లు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇలాంటి టైమ్​లో ట్యాక్స్‌‌‌‌లు పెంచడం సరికాదు. ప్రస్తుతం ఈఎంఐలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీఏ క్వార్టర్లీ ట్యాక్స్‌‌‌‌ తగ్గించాలి. - కొండ గోపాల్‌‌‌‌ రెడ్డి,  తెలంగాణ టూర్స్‌‌‌‌ అండ్‌‌‌‌ ట్రావెల్స్‌‌‌‌ ఓనర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌, ప్రెసిడెంట్‌‌‌‌ 

రూ. 200 వచ్చే కరెంట్​ బిల్లు 400 వస్తున్నది
గతంలో నెలకు కరెంట్​ బిల్లు రూ. 200 వస్తే.. ఇప్పుడు రూ. 400 వస్తున్నది. ఇట్లా డబుల్‌‌ రావడం ఏంది? బిల్లులు చూసి.. ఇంట్లో కూలర్‌‌, ఫ్యాన్‌‌ వేయాలంటేనే బుగులైతున్నది. ధనిక రాష్ట్రమంటరు.. చార్జీలు మాత్రం మస్తు వసూలు చేస్తున్నరు. గిట్లయితే.. ఇదేం ధనిక రాష్ట్రం..? పేదోళ్ల గురించి కాస్త ఆలోచించాలి. - పి. నరేశ్​, హైదరాబాద్​