రెగ్యులర్ మెడికల్ బోర్డు వెంటనే పెట్టాలి : మిర్యాల రాజిరెడ్డి

రెగ్యులర్ మెడికల్ బోర్డు వెంటనే పెట్టాలి  : మిర్యాల రాజిరెడ్డి
  • టీబీజీకేఎస్​ ప్రెసిడెంట్​ మిర్యాల రాజిరెడ్డి

గోదావరిఖని, వెలుగు:  రెగ్యులర్ మెడికల్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్​లో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. గత జులైలో జరిగిన మెడికల్ బోర్డుతో పాటు ఇటీవల జరిగిన మెడికల్ బోర్డుతో కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని ఆరోపించారు. 129 మంది కార్మికుల కోసం ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డుకు 128 మంది హాజరు కాగా, వీరిలో 125 మంది అడ్వైస్డ్ మెడికల్ బోర్డుకు చెందిన వారని, మిగతా ముగ్గురు రెఫరల్ మెడికల్ బోర్డుకి చెందినవారని తెలిపారు.

 యాజమాన్యం రెఫర్ చేసిన వారికి కూడా ఎలాంటి న్యాయం చేయకుండా బోర్డు నిర్వహణ తీరు ఉందని విమర్శించారు. బోర్డుకు హాజరైన వారందరి పరిస్థితిని యాజమాన్యం పరిశీలించి, సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఇంకా నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రెగ్యులర్ మెడికల్ బోర్డును నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మీటింగ్​లో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి,  సురేందర్ రెడ్డి, నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాసరావు, చెలకలపల్లి శ్రీనివాస్, వడ్డేపల్లి శంకర్, చెల్పూరి సతీశ్ పాల్గొన్నారు.