
మహబూబ్ నగర్: బీజేపీలో ఎంత పెద్ద నాయకుడైన సరే పార్టీనే సుప్రీమని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. గోషా మహల్ ఎమ్మెల్యే, మాజీ బీజేపీ నేత రాజాసింగ్‌ను ఉద్దేశించే పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. శనివారం (జూలై 26) రామచందర్ రావు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎమ్మెల్సీగా నన్ను గెలిపించిన పాలమూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. పాలమూరు నుంచి ఇంకా వలసలు తగ్గలేదని.. పాలమూరు జిల్లా బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పట్టించుకోవాలని కోరారు. కాంగ్రెస్ కులగుణన ఒక బూటకమని.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం ప్రజలన మోసం చేయడమేనని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని తేల్చి చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి తిరగటమే సరిపోయిందని.. రాష్ట్రంలో పరిపాలనా ఆటకెక్కిందని దుయ్యబట్టారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేనే లేదన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లా భవిష్యత్‌లో బీజేపీ అడ్డాగా మారుతోందని ధీమా వ్యక్తం చేశారు.