- వార్షికంగా 15 శాతం పెరుగుదల
- మొత్తం ఆదాయం రూ. 59,162 కోట్లు
- రూ.24 చొప్పున డివిడెండ్ ప్రకటన
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో ఆదాయం 16.9 శాతం (వార్షికంగా) పెరిగి రూ. 59,162 కోట్లకు చేరుకుంది. నికర లాభం 14.76శాతం పెరిగి రూ. 11,392 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి రూ.42,303 కోట్ల లాభం, రూ.2.25 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఒక్కో షేరుకు రూ. 24 తుది డివిడెండ్ ప్రకటించింది. ఈ కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 24.5శాతం, నెట్మార్జిన్ 19.3శాతం ఉంది. పెద్ద సంఖ్యలో భారీ డీల్స్ కారణంగా నాలుగో క్వార్టర్లో ఆర్డర్‌బుక్ విలువ10 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరం ఆర్డర్ బుక్ విలువను 34.1 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. "2023 ఆర్థిక సంవత్సరంలో మేం బలమైన వృద్ధిని సాధించినందుకు సంతోషంగా ఉంది. అంతకుముందు సంవత్సరంలో గ్రోత్ మధ్యస్తంగా ఉంది. మా ఆర్డర్ బుక్‌ను గమనిస్తే మా సేవలకు డిమాండ్ పెరిగిందని అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో బిజినెస్ మరింత మెరుగ్గా ఉంటుంది”అని టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ తెలిపారు. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన ఈయన తన పదవి నుంచి దిగిపోతారు. కొత్త సీఈఓగా కృతివాసన్ నియమితులవుతారు. కృతికి అన్ని విధాలా సహకరిస్తానని రాజేష్ చెప్పారు.
గ్లోబల్ మార్కెట్లలో టీసీఎస్ గ్రోత్ ఇలా..
ఈసారి యూకే మార్కెట్ 17శాతం పెరిగింది. ఉత్తర అమెరికా 9.6 శాతం, కాంటినెంటల్ యూరప్ 8.4 శాతం వృద్ధి చెందింది. కంపెనీ మార్చి క్వార్టర్లో 821 మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,14,795 కి చేరుకుంది. టాటా గ్రూప్ సంస్థ గతంలో ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించిందని, 2023 ఆర్థిక సంవత్సరంలో నికర ప్రాతిపదికన 22,600 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. కిందట సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్లను తీసుకుంది. 53 వేల క్లౌడ్ సర్టిఫికేషన్‌లను సాధించింది. మొత్తం 1,10,000 మంది ఉద్యోగులను హైపర్ స్కేలర్లలో సర్టిఫై చేశామని టీసీఎస్ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ అన్నారు. ఇదిలా ఉంటే, టీసీఎస్ డైరెక్టర్ల బోర్డు ప్రతి షేరుకు రూ. 24 ఫైనల్ డివిడెండ్‌ను సిఫార్సు చేసింది. ఇందుకు షేర్‌హోల్డర్ల ఆమోదం అవసరం. 28వ ఏజీఎం ముగిసిన తరువాత నాలుగో రోజున డివిడెండ్‌ను చెల్లిస్తామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
