టీసీఎస్​ లాభం రూ.12 వేల 434 కోట్లు..వార్షికంగా 9 శాతం పెరుగుదల

టీసీఎస్​ లాభం రూ.12 వేల 434 కోట్లు..వార్షికంగా 9 శాతం పెరుగుదల
  •     ఆదాయం రూ.61,237 కోట్లు
  •     రూ.28 చొప్పున ఫైనల్​డివిడెండ్​

న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​కు (టీసీఎస్​) 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో ఏకీకృత నికర లాభం రూ. 11,392 కోట్ల నుంచి రూ. 12,434 కోట్లకు పెరిగింది. అంటే వార్షికంగా తొమ్మిది శాతం పెరిగింది. మార్చి 31, 2024తో ముగిసిన మూడు నెలల్లో ఆదాయం 3.5 శాతం పెరిగి రూ.61,237 కోట్లకు చేరుకుందని ఈ ఐటీ కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది. పది బ్రోకరేజ్ అంచనాల ఆధారంగా రూ. 61,414 కోట్ల ఆదాయంపై రూ. 11,902 కోట్ల లాభాన్ని ఎనలిస్టులు అంచనా వేశారు. అంటే కంపెనీ నికర లాభం అంచనాలను అధిగమించగలిగింది. 

అయితే ఆదాయ అంచనాలను అందుకోలేదు. నాలుగో క్వార్టర్​లో ఇబిటా మార్జిన్ లేదా ఆపరేటింగ్ మార్జిన్ 26 శాతం పెరిగింది. మునుపటి క్వార్టర్​లో 25 శాతం నుంచి 100 బేసిస్​ పాయింట్లు పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరం పూర్తి సంవత్సరానికి, ఆదాయం 6.8 శాతం పెరిగి రూ. 240,893 కోట్లకు చేరుకుంది. ఏడాది నికర లాభం రూ.46,585 కోట్లు కాగా, సంవత్సరానికి ఆపరేషనల్​ మార్జిన్ 24.6శాతం ఉంది. టీసీఎస్​ బోర్డు కూడా ఒక్కో షేరుకు రూ. 28 ఫైనల్​ డివిడెండ్‌‌‌‌ను ఆమోదించింది. 

భారీగా ఆర్డర్లు

మొత్తం ఆదాయంలో సగం వాటా  ఉన్న ఉత్తర అమెరికాలో ఆదాయం సంవత్సరానికి 2.3శాతం పడిపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్  ఇన్సూరెన్స్ క్లయింట్ల నుంచి వచ్చే ఆదాయం 3.2శాతం తగ్గింది. అయినప్పటికీ, టీసీఎస్​ ఈ క్వార్టర్​లో రికార్డు స్థాయిలో 13.2 బిలియన్ల డాలర్ల విలువైన ఆర్డర్లను సాధించింది. ఇందులో ఇప్పటికే ఉన్న క్లయింట్ అయిన యూకే బీమా సంస్థ అవీవాతో 15 సంవత్సరాల మెగా డీల్ కూడా ఉంది. 

జనవరి-–మార్చి క్వార్టర్​లో కన్సాలిడేటెడ్ ఆదాయం 3.5శాతం పెరిగి రూ. 61,237 కోట్లకు చేరుకుందని టీసీఎస్​ తెలిపింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్  మాట్లాడుతూ  నాలుగో క్వార్టర్​లో తమ ఆర్డర్ బుక్  26శాతం ఆపరేటింగ్ మార్జిన్‌‌‌‌తో ముగుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.  చీఫ్ హెచ్‌‌‌‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరే ఈసారీ వార్షిక ఇంక్రిమెంట్‌‌‌‌లను ఇస్తామని చెప్పారు. బాగా పనిచేసిన వారు రెండంకెల పెంపును అందుకుంటున్నారని అన్నారు. రాజీనామాలు 12.5శాతం తగ్గాయని,  క్యాంపస్ నియామకానికి ఉత్సాహభరితమైన  స్పందన వచ్చిందని వివరించారు. టీసీఎస్ షేరు ధర బీఎస్ఈ​లో శుక్రవారం 0.48 శాతం పెరిగి 4003.80లకు చేరింది.