ఏపీలో డ్రగ్స్ దందా.. గవర్నర్‌కు లోకేశ్‌ ఫిర్యాదు

 ఏపీలో డ్రగ్స్ దందా..  గవర్నర్‌కు లోకేశ్‌ ఫిర్యాదు

ఏపీలో విచ్చల విడిగా గంజాయి అమ్ముతున్నార‌ని , అయినా ప్రభుత్వం ప‌ట్టించు కోవ‌డం లేదంటూ రాష్ట్ర గ‌వ‌ర్నర్ అబ్దుల్ న‌జీర్ కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారు. శ‌నివారం( జులై 15)  నారా లోకేష్ మ‌ర్యాద పూర్వకంగా గ‌వ‌ర్నర్ ను క‌లిశారు. ఈ మేర‌కు మాద‌క ద్రవ్యాల అమ్మకాల‌ను అదుపులో పెట్టాల‌ని కోరుతూ విన‌తి పత్రం స‌మ‌ర్పించారు.

డ్రగ్స్ స‌ర‌ఫ‌రాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందంటూ స్పష్టం చేసిన డీఆర్ఐ త‌యారు చేసిన నివేదిక‌ను గ‌వ‌ర్నర్ కు అంద‌జేశారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా ఆ మూలాలు ఏపీలో దొరుకుతున్నాయ‌ని తెలిపారు. దీంతో డ్రగ్స్ కు ఏపీ కేరాఫ్ గా మారింద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు నారా లోకేశ్.అంతే కాకుండా హ‌వాలా లావాదేవీలు రాష్ట్ర ఆర్థిక వ్యవ‌స్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని గ‌వ‌ర్నర్ అబ్దుల్ న‌జీర్ ను కోరారు. ఇదిలా ఉండ‌గా నారా లోకేశ్ తో పాటు టీడీపీ నేత‌లు ష‌రీఫ్, న‌క్కా ఆనంద్ బాబు, కొల్లు ర‌వీంద్ర ఉన్నారు.

ALSO READ :రూ. 2 వేల కోట్లు ఇచ్చి ఆదుకోండి.. కేంద్రాన్ని కోరిన సీఎం

గ‌వ‌ర్నర్ ను క‌లిసిన అనంత‌రం లోకేష్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేత‌ల ప్రమేయంతోనే రాష్ట్రంలో మాద‌క ద్రవ్యాల స‌ర‌ఫ‌రా జ‌రుగుతోంద‌ని ఆరోపించారు. డ్రగ్స్ ఉత్పత్తి, స్మగ్లింగ్ లో ప‌ట్టుబ‌డిన వారిలో ఎక్కువ‌గా వైసీపీ నేత‌లే ఉన్నార‌ని మండిప‌డ్డారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో.. యువత గంజాయి మత్తులో ఎన్నో దారుణాలకు పాల్పడిందని, విద్యార్థులపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన చెందారు. గవర్నర్ ను కలిసిన అనంతరం లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగించారు.