
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. సార్వత్రిక ఎన్నికలను తలపించే రేంజ్ లో హైడ్రామా నడిచిన ఈ ఉపఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. జగన్ సొంత నియోజికవర్గమైన పులివెందులలో వైసీపీకి డిపాజిట్లు గల్లంతవ్వడం గమనార్హం.ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన ఈ ఎన్నికలో టీడీపీకి 6 వేల 735 ఓట్లు పోలవ్వగా.. వైసీపీ కేవలం 683 ఓట్లకే పరిమితం అయ్యింది.
వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి లతా రెడ్డి 6 వేల 52 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 30 ఏళ్ళ తర్వాత పులివెందులలో పసుపు జెండా ఎగరడంతో టీడీపీ క్యాడర్ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. టీడీపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన టీడీపీకి పులివెందుల విజయం మరింత బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి.
Also Read:-పులివెందుల ,ఒంటిమిట్ట బైపోల్... జగన్ పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. మంగళవారం ( ఆగస్టు 12 ) జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా నెలకొన్న హైడ్రామా జాతీయస్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్, వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం వంటి ఘటనలు ఉద్రిక్తతకు దారి తీయగా... పలు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లను పోలీసులే అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. పక్క నియోజకవర్గాల నుంచి టీడీపీ కార్యకర్తలు వచ్చి దొంగ ఓట్లు వేశారంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.