చాయ్​పత్తా అనుకుని పురుగుల మందుతో టీ

చాయ్​పత్తా అనుకుని పురుగుల మందుతో టీ

భార్య మృతి.. విషమంగా భర్త, మరిది పరిస్థితి

బచ్చన్నపేట, వెలుగు: ఎండ్రిన్​ గోళీలను టీ పొడి అనుకుని చేసుకొని తాగడంతో ఒకరు మృతిచెందగా ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన బుధవారం జనగామ జిల్లా రామచంద్రాపురం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాసారం అంజమ్మ(65), మల్లయ్య రోజు మాదిరిగానే ఉదయాన్నే టీ చేసుకున్నారు. గమనించకుండా అందులో టీ పొడికి బదులు పంటకు చల్లే ఎండ్రిన్​ గోళీలు వేసుకున్నారు. హైదరాబాద్​ నుంచి వచ్చిన మరిది భిక్షపతికి టీ పోసి అంజమ్మ, మల్లయ్య కూడా తాగారు. తాగిన కొద్దిసేపటికి ముగ్గురూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. పక్క ఇంటిలో ఉంటున్న కొడుకు చంద్రమౌళికి సమాచారం తెలియడంతో వెంటనే వచ్చి జనగామ ఏరియా హాస్పిటల్​కు తరలించారు. ట్రీట్మెంట్​ పొందుతూ అంజమ్మ మృతిచెందింది. మల్లయ్య, భిక్షపతిలను మెరుగైన ట్రీట్మెంట్​ కోసం వరంగల్​ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ఎప్పుడో పంటకు చల్లగా మిగిలిన గోళీలు ఓ డబ్బాలో వేసి వంటింట్లో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 

పెండ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్లి..
దాసారం భిక్షపతి కొన్నాళ్లుగా హైదరాబాద్​ సమీపంలోని అన్నోజిగూడ వద్ద కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవలే  భిక్షపతి కొడుకు పెండ్లి పెట్టుకున్నారు.  అన్న మల్లయ్య కుటుంబ సభ్యులకు పెండ్లి పత్రిక ఇవ్వడానికి మంగళవారం రాత్రి రామచంద్రాపురం వచ్చారు. తెలియక ముగ్గురూ విషం గోళీలతో చేసిన టీ తాగడంతో ప్రాణాపాయంలో పడ్డారు.