పిల్లా పాపలతో రోడ్డెక్కిన 13 జిల్లాల ఉపాధ్యాయులు

 పిల్లా పాపలతో రోడ్డెక్కిన 13 జిల్లాల ఉపాధ్యాయులు
  • డీఎస్​ఈ ఎదుట మౌనదీక్ష
  • వచ్చినవారిని వచ్చినట్లు అరెస్టు చేసిన పోలీసులు
  • పిల్లలతో పాటు పోలీస్​స్టేషన్లకు తరలింపు

హైదరాబాద్ : స్పౌజ్ బదిలీలు చేపట్టాలంటూ కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న 13 జిల్లాల టీచర్లు.. టీచర్స్​ డే నాడు కూడా నిరసనకు దిగారు. హైదరాబాద్​లోని డైరెక్టరేట్​ ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్​(డీఎస్​ఈ) ముందు పిల్లాపాపలతో మౌనదీక్షకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. జిల్లాల నుంచి వచ్చినవారిని వచ్చినట్లు అరెస్ట్​ చేసి పోలీస్​ స్టేషన్లకు తరలించారు. టీచర్లను అరెస్టు చేస్తుండగా.. వారి పిల్లలు విలపించడం అక్కడివారిని కదిలించివేసింది. టీచర్లతోపాటు వారి పిల్లలను కూడా పోలీస్​ స్టేషన్లకు తరలించారు. టీచర్లను అరెస్టు చేస్తుండగా.. వారి పిల్లలు విలపించడం అక్కడివారిని కదిలించివేసింది. టీచర్లతోపాటు వారి పిల్లలను కూడా పోలీస్​ స్టేషన్లకు తరలించారు. టీచర్స్​ డే వేడుకల్లో ఉండాల్సిన తమను రోడ్డుమీదికి ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఇలా అరెస్టు చేయడం ఏమిటని ఉపాధ్యాయులు కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో పనిచేయాల్సిరావడంతో కన్నబిడ్డల భవిష్యత్తు ఆగమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మౌన దీక్షకు రాగా..
రాష్ట్ర ప్రభుత్వం గతంలో 19 జిల్లాల్లో స్పౌజ్​ బదిలీలు చేపట్టి.. మరో 13 జిల్లాలను బ్లాక్​లో పెట్టింది. దీంతో ఆ 13 జిల్లాల టీచర్లు సోమవారం మౌనదీక్ష చేసేందుకు డీఎస్ఈ ఆఫీసు ముందుకు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో గేటు ముందు బైఠాయించారు. స్పౌజ్ బదిలీలు నిర్వహించాలని, వేర్వేరు జిల్లాల్లో ఉంటున్న భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్​ ఇవ్వాలని నినాదాలు చేశారు. అయితే డైరెక్టరేట్​ ముందు ఆందోళనకు పర్మిషన్ లేదంటూ పోలీసులు చెప్పడంతో.. వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మహిళా టీచర్లు ప్రతిఘటించడం, పిల్లలు ఏడ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జిల్లాల నుంచి విడతల వారీగా టీచర్లు వచ్చి డీఎస్ఈ ముందు నిరసన తెలుపగా, వచ్చిన వారిని వచ్చినట్టు పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ అబిడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, రాంగోపాల్​ పేట, గాంధీనగర్​, నాంపల్లి తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే అక్కడ మహిళా టీచర్లు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలియజేశారు. తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం ప్రతినిధులు వివేక్, ఖాదర్, నరేశ్​ మాట్లాడుతూ... ప్రభుత్వం వెంటనే 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయా జిల్లాలను బ్లాక్ లో పెట్టడంతో భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో డ్యూటీ చేయాల్సి వస్తున్నదని.. 1,800 కుటుంబాలు ఆగమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులైన దంపతులు ఒకే జిల్లాలో ఉంటేనే మంచి ఫలితాలు సాధించగలమని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారని వారు గుర్తుచేశారు.

కానీ, అమలు చేయడం లేదని వాపోయారు. భర్త ఖమ్మం జిల్లాలో ఉంటే భార్య భద్రాచలం –చత్తీస్ గఢ్​ సరిహద్దుల్లో పనిచేస్తున్నారని, నిజామాబాద్​ జిల్లా బోధన్​లో భర్తను ఉంచి, ఆసిఫాబాద్ –మహారాష్ట్ర సరిహద్దుకు భార్యను  పంపించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఒక్కొక్కరు వందల దూరంలో ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నదని, దీంతో కన్న బిడ్డలను ఎక్కడ ఉంచాలో అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని అన్నారు. సమస్యను పరిష్కరించమని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యాశాఖ అధికా రుల చుట్టూ   తిరిగినా ఫలితం ఉండటం లేదని వా పోయారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తమ బాధను అర్థం చేసుకొని, ఇచ్చిన హామీ ప్రకారం సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్​ చేశారు. అరెస్టయిన వారిలో స్పౌజ్ ఫోరం ప్రతినిధులు త్రివేణి, మమత, సుజాత, శిరీష, ఆనందం, చంద్రశేఖర్, బాలస్వామి తదితరులున్నారు. టీచర్ల అరెస్టును యూటీఎఫ్​, టీపీటీఎఫ్, తపస్​, టీఆర్​టీఎఫ్​ సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు.