
బడుల్లో నేటి నుంచి డీఈవో, ఎంఈవోల తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: బడులకు ప్రేయర్ టైమ్‌కు రాని టీచర్లకు చెక్ పెట్టేందుకు పాఠశాల విద్యా శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అందరు డీఈవోలు, ఎంఈవోలు శుక్రవారం నుంచి వారి పరిధిలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌కు ప్రార్థన సమయానికి ఆకస్మిక తనిఖీకి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ విజయ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏ స్కూల్‌కు వెళ్లారు, ఎన్ని గంటలకు ప్రార్థన జరిగింది, ఏమైనా లోపాలను గుర్తించారా.. తదితరాలపై ఉదయం 11 గంటల్లోపు నివేదిక పంపాలని ఆదేశించారు. చాలా మంది ప్రేయర్ టైమ్‌కు వస్తలేరని ఫిర్యాదులందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త నిర్ణయాన్ని స్టూడెంట్స్, టీచర్ల యూనియన్లు స్వాగతిస్తున్నాయి.
ప్రతి శనివారం ఓ వీఐపీ
ప్రతి శనివారం.. ప్రతి స్కూల్ ప్రేయర్ టైమ్‌లో లేదా ఆటల టైమ్‌లో ఓ వీఐపీ పాల్గొనేలా చూడాలని డీఈవోలు, ఆర్జేడీలను విజయ్‌కుమార్ ఆదేశించారు. సమస్యల పరిష్కారం, అధికారుల సమన్వయం కోసం కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ తదితరులను ఆహ్వానించాలన్నారు. ఉత్తర్వులను హెడ్మాస్టర్లు అమలు చేయాలని ఆదేశించారు.