త్వరలో టీచర్ పోస్టుల భర్తీ..

త్వరలో టీచర్ పోస్టుల భర్తీ..

త్వరలోనే పాత డీఎస్సీ పద్దతిలోనే టీచర్ పోస్టుల భర్తీ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దేశంలోనే మొదటిసారి వర్క్ షీట్స్ పెట్టిన ఘనత తెలంగాణాకే దక్కుతుందని ఆమె అన్నారు. టి-సాట్ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకున్నారని ఆమె తెలిపారు. 

‘విద్యార్థులకు ప్రభుత్వం 85శాతం డిజిటల్ స్టడీని అందిస్తోంది. డిజిటల్ పాఠాలు పిల్లలకు అందించిన రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటిదిగా తెలంగాణ నిలిచింది. హైదరాబాద్ నగరంలో వరదల్లో సర్టిఫికెట్స్ నష్టపోయిన పిల్లలకు మళ్ళీ కొత్తవి అందించాం. కరోనా ప్రభావం ఇంకా రాష్ట్రంలో కొనసాగుతోంది. కరోనా వల్ల విద్యార్థుల చదువుకు ఇబ్బందులు కాకుండా డిజిటల్ తరగలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కస్తూర్బా గురుకురాల్లో కోర్సులు పెంచి.. ఇంటర్ వరకు చదువుకునే వెసులుబాలు కల్పించాం. కరోనా వల్ల ఇంటర్ క్లాసులు డిజిటల్ ద్వారా అందించి.. 80 శాతం సిలబస్ పూర్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు, డిగ్రీ కాలేజీలకు కావాల్సినన్ని నిధులు ప్రభుత్వం ఇస్తోంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్స్ నియామకం త్వరలోనే ఉంటుంది. విద్యాలయాల యజ్ఞానికి ప్రభుత్వం స్వీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు బడ్జెట్‌లో 4 వేల కోట్లు ప్రత్యేక నిధులను కేటాయించారు. నేను, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో కొత్త విధివిధానాలు, ప్రణాళికలు నిర్ణయిస్తాం. అంతర్ జిల్లా బదిలీలు మరియు మహిళల ప్రత్యేక సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలల టీచర్స్ జీతాలపై నివేదిక కోసం ప్రభుత్వం తిరుపతి రావు కమిటీని వేసింది. విద్యాశాఖ తరపున తిరుపతిరావు కమిటీ సిఫార్సులు అమలు చేసే అవకాశం ఉంటుంది.

 సంక్షేమ విద్యా సంస్థల్లో 4 లక్షల విద్యార్థులు చదువుతున్నారు. త్వరలోనే పాత డీఎస్సీ పద్ధతిలోనే ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా గురుకులాల విద్యార్థులు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు’ అని మంత్రి సబితా అన్నారు.