ఆగస్టు 02 నుంచి టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ.. మొదటగా సీనియార్టీ, ఖాళీల లిస్టులు.. పూర్తి వివరాలు ఇవే

ఆగస్టు 02 నుంచి టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ.. మొదటగా సీనియార్టీ, ఖాళీల లిస్టులు.. పూర్తి వివరాలు ఇవే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 2 నుంచి 11 వరకు పదిరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ఎలాంటి కోర్టు కేసులు అడ్డురాకుంటే ఈ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సారి 3,867 మంది టీచర్లకు ప్రమోషన్లు రానున్నాయి. 

వీరిలో 902 మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్​ఎంలుగా, 2,965 మంది ఎస్​జీటీలు స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్​ఎంలుగా ప్రమోషన్లు పొందనున్నారు. కాగా, కొందరు బదిలీలు నిర్వహించిన తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు మంగళవారానికి వాయిదా పడింది. 

సర్కారు నిబంధనల ప్రకారం బదిలీలకు రెండేండ్ల సర్వీస్ పూర్తికావాల్సి ఉందని.. కానీ, హెచ్​ఎంలకు బదిలీలు నిర్వహించి రెండేండ్లు పూర్తికాలేదని అధికారులు చెప్తున్నారు. ప్రమోషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందనే ఆశతో ఉన్నామని పేర్కొంటున్నారు. కాగా, మంగళవారం హైకోర్టులో హియరింగ్ పూర్తయిన తర్వాతే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. 

ప్రమోషన్ల షెడ్యూల్ ఇలా.. 

ఈ నెల 2న ఆన్​లైన్​లో హెచ్ఎం, స్కూల్ ఇసిస్టెంట్ ప్రస్తుత ఖాళీల లిస్టు, ఎస్​ఏ, ఎస్​జీటీల తాత్కాలిక సీనియార్టీ లిస్టు విడుదల చేస్తారు. 3న సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల సమర్పణ, 4 ,5 తేదీల్లో  అభ్యంతరాల పరిష్కారం,  స్కూల్ అసిస్టెంట్ల ఫైనల్ సీనియర్టీ లిస్టు రిలీజ్, 6 న  జీహెచ్ఎం ప్రమోషన్ల కోసం స్కూల్ అసిస్టెంట్ల వెబ్ ఆప్షన్లు, అందుబాటులో ఎడిట్ ఆప్షన్లు, 7న జీహెచ్ఎం ప్రమోషన్ల ఉత్తర్వులు జారీ, 8,9తేదీల్లో ఎస్​జీటీల ఫైనల్ సీనియార్టీ లిస్టు, స్కూల్ అసిస్టెంట్, పీఎస్ హెచ్​ఎం ఖాళీల లిస్టు రిలీజ్, 10 న ఎస్​ఏ ప్రమోషన్ కోసం ఎస్​జీటీల వెబ్ ఆప్షన్లు, 11న జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఎస్​ఏ , పీఎస్ హెచ్​ఎం ప్రమోషన్ల ఆర్డర్లు ఇవ్వనున్నారు.