టీచర్లు, ఉద్యోగుల మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు బేరసారాలు

టీచర్లు, ఉద్యోగుల మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు బేరసారాలు
  • బ్లాక్​ చేసిన 13 జిల్లాల్లో ట్రాన్స్​ఫర్లకు ఎక్కువ మంది టీచర్ల ప్రయత్నం 
  • 317 జీవోతో నష్టపోయిన టీచర్లకేనంటూ సర్కార్​ షరతు

హైదరాబాద్​, వెలుగు: టీచర్లు, ఉద్యోగుల మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు బేరసారాలు మొదలయ్యాయి. మ్యూచువల్​ బదిలీలకు అప్లయ్​ చేసుకునేందుకు సర్కారు ఈ నెల15 దాకా అవకాశమివ్వడంతో.. తమతో మ్యూచువల్​కు వచ్చే తోటి ఉద్యోగుల కోసం వెతుక్కుంటున్నారు. అందుకు వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​లలో గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత వరకు ఊరికి దగ్గర్లో ఉన్నవాళ్లతోనే మ్యూచువల్​ పెట్టుకునేందుకు టీచర్లు ఆసక్తి చూపిస్తున్నారు. జిల్లాను బట్టి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల దాకా బేరసారాలు నడుస్తున్నట్టు టీచర్లు చెప్తున్నారు. అయితే, కొందరు టీచర్లు మాత్రం ఎలాంటి డబ్బులకు ఆశపడకుండానే మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు ఒప్పుకుంటున్నారని తెలుస్తోంది. 

కండిషన్స్​ అప్లై..

ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరిసారిగా టీచర్ల మ్యూచువల్​ బదిలీలు జరిగాయి. రెండేండ్ల సర్వీస్​ పూర్తి చేసుకున్నోళ్లందరికీ అప్పట్లో అందుకు అవకాశం కల్పించారు. అయితే, తెలంగాణ వచ్చాక మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు అవకాశమిస్తామని సీఎం కేసీఆర్​ ఎన్నోసార్లు చెప్పినా అది అమలుకు నోచుకోలేదు. తాజాగా కొత్త జిల్లాలు, జోన్ల ప్రాతిపదికన ఉద్యోగులు, టీచర్లను అలాట్​చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను తీసుకొచ్చింది. అయితే, చాలా మంది టీచర్లకు సొంత జిల్లాలు కాకుండా వేరే జిల్లాల్లో పోస్టింగులు రావడంతో టీచర్లు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో సర్కారు మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు అవకాశం కల్పించింది. అయితే, జీవో వల్ల నష్టపోతున్న టీచర్లు మాత్రమే అందుకు అర్హులని షరతు పెట్టింది. ఈ నెల ఫస్ట్​ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. 

సిటీకి దగ్గర ఉండేలా

మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు ఉమ్మడిజిల్లా పరిధిలోనూ సర్వీస్​ ప్రొటెక్షన్​ ఉండబోదని సర్కారు గతంలో చెప్పింది. దీంతో చాలా మంది వెనకడుగు వేశారు. ఇప్పుడు ఆ రూల్​ను సర్కారు ఎత్తివేయడంతో ఎక్కువమంది టీచర్లు మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్పౌజ్​ బదిలీలను బ్లాక్​ చేసిన 13 జిల్లాల్లో డిమాండ్​ ఎక్కువగా ఉందని టీచర్లు చెప్తున్నారు. పిల్లల చదువులు, కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది టీచర్లు హైదరాబాద్​కు దగ్గర్లో ఉండేందుకు వీలుగా రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. వాటితో పాటు హనుమకొండ, కరీంనగర్​ తదితర జిల్లాల్లోనూ మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు 
డిమాండ్​ ఉందని అంటున్నారు.

ఇప్పటిదాకా 870 అప్లికేషన్లు

మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు ఇప్పటిదాకా 870 అప్లికేషన్లు వచ్చినట్టు సీఎస్​ సోమేశ్​ కుమార్​ తెలిపారు. మీ–సేవ సెంటర్ల నుంచి ఆన్​లైన్​లో అప్లికేషన్లను తీసుకుంటున్నట్టు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, మ్యూచువల్​ ట్రాన్స్​ఫర్లకు సేమ్​ కేడర్​, సేమ్​ సబ్జెక్ట్​ టీచర్లు దొరకడం కష్టమవుతుండడంతో వారికి డిమాండ్​ పెరిగింది. త్వరలోనే కొందరు సీనియర్​ స్కూల్​ అసిస్టెంట్లు హెడ్మాస్టర్లుగా ప్రమోట్​ అయ్యే అవకాశం ఉండటంతో.. వాళ్లు ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడున్నా ప్రమోషన్​ వస్తే మళ్లీ ట్రాన్స్​ఫర్​ అవుతుందన్న భావనతోనే వాళ్లు మ్యూచువల్​కు ఒప్పుకుంటున్నట్టు చెప్తున్నారు.