తెలంగాణ రాష్ట్రంలోని ‘సింగిడి’ పాఠాలు మళ్లీ తేవాలి : తెలుగు ఉపాధ్యాయులు

తెలంగాణ రాష్ట్రంలోని ‘సింగిడి’ పాఠాలు మళ్లీ తేవాలి : తెలుగు ఉపాధ్యాయులు
  •     2027-28 విద్యా సంవత్సరం నుంచే తప్పనిసరి చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సీబీఎస్ఈ స్కూళ్లలో 9, 10వ తరగతులు చదువుతున్న ద్వితీయ భాష తెలుగు విద్యార్థులకు, ప్రస్తుతం అమలులో ఉన్న ‘వెన్నెల - 5’ స్థానంలో ‘సింగిడి - 1, 2’,  ‘నవ వసంతం’ పాఠ్యపుస్తకాలను తిరిగి ప్రవేశపెట్టాలని విద్యావేత్తలు, తెలుగు ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. 2027-–28 విద్యా సంవత్సరం నుంచే ఈ పుస్తకాలను విద్యా ప్రమాణాలకు అనుగుణంగా తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతూ ఆదివారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేదికగా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ట్రస్మా అధ్యక్షుడు ఎస్. నరసింహారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాష ఎంతో తియ్యనిదని, మన అక్షరాలు గుండ్రంగా ఎంతో అందంగా ఉంటాయని కొనియాడారు. ఏవీఐఎస్  ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ.. భాష లేకుంటే జీవన మనుగడ లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని చాటిన శ్రీకృష్ణదేవరాయలను, పీవీ నరసింహారావును స్మరించుకున్నారు. డీపీఎస్ ప్రిన్సిపాల్ వనజ మాట్లాడుతూ. తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థుల మూర్తిమత్వ వికాసానికి కారకులని పేర్కొంటూ, గతంలో ఉన్న ప్రమాణాలతో కూడిన ‘నవ వసంతం’, ‘సింగిడి’ పుస్తకాలను తిరిగి తీసుకురావాలని ఆకాంక్షించారు.