టార్గెట్ చేసి.. నిందలు మోపిండు, అందువల్లే MRO హత్య

టార్గెట్ చేసి.. నిందలు మోపిండు, అందువల్లే MRO హత్య
  • సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యల వల్లే విజయారెడ్డి హత్య
  • ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాల నేతల ఆరోపణ
  • ఆర్టీసీ, రెవెన్యూ ఉద్యోగుల పరిస్థితే భవిష్యత్‌లో అందరికీ
  • ఇప్పుడున్న ఉద్యోగ జేఏసీ ప్రభుత్వ తొత్తుగా మారింది
  • ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకొచ్చి కొత్త జేఏసీ ఏర్పాటు చేయాలి
  • రేపటి నుంచి రెవెన్యూ ఉద్యోగుల పెన్‌డౌన్‌
  • 22 వరకు కార్యాచరణ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ‘‘రెవెన్యూ ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో చేసిన అవినీతి ఆరోపణలు, ఆయన మోపిన నిందలతోపాటు రియల్‌ ఎస్టేట్‌ మాఫియా వల్లే తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య జరిగింది. సీఎం కేసీఆర్‌ ఒక్కో శాఖ ఉద్యోగులను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. ఇవాళ ఆర్టీసీ, రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులే భవిష్యత్‌లో ఉపాధ్యాయులకు, ఇతర శాఖల ఉద్యోగులకు తప్పవు” అని ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు అన్నారు. ఇప్పుడున్న ఉద్యోగ జేఏసీ.. ప్రభుత్వానికి తొత్తుగా మారిందని, ఉద్యోగుల సమస్యలపై ఉద్యమించేందుకు కొత్త జేఏసీ అవసరమని, ఈ దిశగా ఉద్యోగ సంఘాలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.  ‘విజయారెడ్డి సజీవ దహనం– తదుపరి పరిణామాలు’ అనే అంశంపై రెవెన్యూ జేఏసీ ఆధ్వర్యంలో టీచర్లు, ఉద్యోగ, కార్మిక, పెన్షనర్స్‌, సీపీఎస్‌ సంఘాలతో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

సమావేశానికి రెవెన్యూ జేఏసీ నేత వి.లచ్చిరెడ్డి అధ్యక్షత వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రాములు, టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఘునందన్‌, టీజీసీటీఏ ప్రధాన కార్యద‌ర్శి విజ‌య్ కుమార్, ఎస్‌టీయూటీఎస్‌ అధ్యక్షుడు ఎం.ప‌ర్వత‌రెడ్డి, రెవెన్యూ జేఏసీ నాయకులు ఎస్‌.రాములు, ఎన్‌.ల‌క్ష్మీనారాయ‌ణ‌, వంగూరు రాములు, సుధాక‌ర్‌రావు, బి.సుద‌ర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్పుడు శభాష్‌ అన్నరు.. ఇప్పుడు దోషులమా?: లచ్చిరెడ్డి

రెవెన్యూ ఉద్యోగులు నిత్యం ప్రజలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని, కానీ విజ‌యారెడ్డి హ‌త్య త‌ర్వాత‌ స్వేచ్ఛగా ప్రజల దగ్గరికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని లచ్చిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి తాము 58 లక్షల పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను ఇస్తే అప్పుడు శభాష్‌ అన్న సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగులను దోషులుగా చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని భూ స‌మస్యలకు రెవెన్యూ ఉద్యోగులే కార‌కులన్నట్లుగా చెబుతున్నార‌ని, చ‌ట్టాల్లో ఉన్న గంద‌ర‌గోళం, సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాలు, ఉద్యోగుల కొర‌తతోనే ఎక్కువ భూస‌మ‌స్యల వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఇక నుంచి రెవెన్యూ జేఏసీగానే పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ‌ను నాశ‌నం చేసేందుకు ప్రయత్నిస్తోందని రెవెన్యూ జేఏసీ నాయ‌కుడు ఉపేంద‌ర్ రావు ఆరోపించారు.

60 ఏళ్ల స‌మైక్య రాష్ర్టంలో లేని క‌ష్టాలు ఈ ఆరేళ్లలో..:  థామస్​రెడ్డి

60 ఏళ్ల స‌మైక్యాంధ్ర పాల‌న‌లోనూ ప‌డ‌న‌న్ని క‌ష్టాలు ఈ ఆరేళ్ల తెలంగాణ‌ రాష్ట్రంలో ప‌డుతున్నామ‌ని ఆర్టీసీ జేఏసీ నేత థామ‌స్ రెడ్డి వాపోయారు. ప్రభుత్వ పెద్దలు నియంత‌ల్లా వ్యవహ‌రిస్తున్నార‌ని, ఈ చ‌ర్యలను ఉద్యోగ లోకమంతా ఖండించాల‌న్నారు. 26 మంది ఆర్టీసీ కార్మికులు మ‌ర‌ణిస్తే ముఖ్యమంత్రి క‌నీసం సానుభూతి చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగులు ఆర్టీసీలో విధులు చేయొద్దని కోరారు. రెవెన్యూ ఉద్యోగుల పోరాటానికి ఆర్టీసీ కార్మికుల మ‌ద్దతు ఉంటుంద‌ని స్పష్టం చేశారు.

ఐక్యంగా పోరాడాలి: రాజిరెడ్డి

ఉద్యోగుల‌పై ప్రభుత్వ వైఖ‌రికి వ్యతిరేకంగా ఉద్యోగ‌, ఉపాధ్యాయ‌, కార్మిక సంఘాల‌న్నీ ఐక్యంగా పోరాడాల‌ని ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇత‌ర ఉద్యోగ సంఘాలు మ‌ద్దతుగా ఒక రోజు పెన్‌డౌన్‌ చేయాలని కోరారు. త‌మ శాఖ‌ల డ్యూటీలు ఇత‌ర శాఖ‌ల వారు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

దాడుల‌కు సీఎందే బాధ్యత: చావ రవి

అసెంబ్లీలో సీఎం ప్రక‌ట‌న త‌ర్వాత రెవెన్యూ ఉద్యోగుల‌పై ప్రజ‌ల్లో ఆగ్రహం పెరిగింద‌ని, వారిపై దాడుల‌కు సీఎం బాధ్యత వ‌హించాల‌ని టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యద‌ర్శి చావ ర‌వి డిమాండ్‌ చేశారు. స‌మైక్యాంధ్రలో ఆత్మగౌర‌వంతో కొట్లాడి హ‌క్కులను సాధించుకున్న ఉద్యోగ సంఘాల్లో ఐక్యత కొర‌వడిందన్నారు.

ఉసిగొల్పుతుండు: జాక్టో నేత జి.స‌దానంద గౌడ్

రెవెన్యూ ఉద్యోగుల ప‌నితీరు బాగుంద‌ని ఒక నెల‌ జీతం ప్రకటించిన సీఎం కేసీఆర్‌.. తర్వాత ప్రజలను రెవెన్యూ ఉద్యోగుల‌పైకి ఉసిగొల్పుతున్నార‌ని జాక్టో నేత జి.స‌దానంద గౌడ్ ఆరోపించారు. విజ‌యారెడ్డి హ‌త్యకు ముఖ్యమంత్రి బాధ్యత వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. రెవెన్యూ ఉద్యోగులు భూప‌రిపాల‌న కంటే ఇత‌ర ప‌నులే ఎక్కువ చేస్తున్నార‌ని తెలిపారు. ఉద్యోగుల హ‌క్కుల‌పై పోరాడేందుకు కొత్త జేఏసీ ఏర్పడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఇత‌ర శాఖల స‌మ‌స్యల‌పైనా స్పందించాలి

ఏ శాఖ స‌మ‌స్యలపై ఆ శాఖ ఉద్యోగులు మాత్రమే స్పందిస్తే స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌ని, ఉమ్మడి పోరాటం ద్వారా ఇత‌ర శాఖల స‌మ‌స్యల‌పై కూడా స్పందించాల‌ని ఎల‌క్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నేత మేడి ర‌మేశ్ అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల పోరాటానికి త‌మ సంపూర్ణ మ‌ద్దతు ఉంటుంద‌ని ప్రకటించారు.

పీఆర్సీ పేరుతో మ‌ళ్లీ భ్రమ‌ల్లోకి నెడుతున్నరు

స‌మైక్య పాల‌కులు కూడా చూప‌ని అణచివేత‌ను ఇప్పుడు చూపిస్తున్నార‌ని స్టేట్ టీచర్‌ ఫెడరేషన్‌ (ఎస్టీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు పోచ‌య్య ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగులు భ‌యాందోళ‌న‌లో ఉన్నార‌ని, ఇందుకు ముఖ్యమంత్రి వ్యాఖ్యలే కార‌ణ‌మ‌న్నారు. పీఆర్‌సీ పేరుతో మ‌ళ్లీ త‌మ‌ను భ్రమ‌ల్లోకి నెట్టేస్తున్నార‌ని అన్నారు. తాడోపేడో తేల్చుకునే వారు వెన‌క‌డుగు వేయొద్దని సూచించారు.

నిరంకుశత్వాన్ని అడ్డుకోవాలి

ముఖ్యమంత్రికి ఏ వ్యవస్థపైనా గౌర‌వం లేద‌ని టీఎస్‌పీటీఏ ప్రధాన కార్యద‌ర్శి చిన్న రాములు మండిపడ్డారు. ఉద్యోగుల‌పై ప్రభుత్వ వైఖ‌రిని ప్రశ్నించాల‌ని, నిరంకుశత్వాన్ని అడ్డుకోవాల‌న్నారు. రెవెన్యూ ఉద్యోగుల పోరాటానికి త‌మ మ‌ద్దతు ఉంటుంద‌న్నారు.

రెవెన్యూ జేఏసీ కార్యాచరణ ఇదీ..

  • 13వ తేదీ నుంచి అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో పెన్​డౌన్. 13, 14 తేదీల్లో సర్పంచుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు ప్రజాప్రతినిధులందరికీ వినతిపత్రాల సమర్పణ.
  • 15న తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట వంటావార్పు
  • 16వ తేదీ నుంచి నుంచి అత్యవసర సేవలు మినహా భూసంబంధిత విధుల నుంచి దూరం.
  • 16న ఖమ్మంలో వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల రెవెన్యూ ఉద్యోగులతో, 19న కామారెడ్డిలో కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాల ఉద్యోగులతో, 22న హైదరాబాద్‌లో మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ఉద్యోగులతో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు.
  • హైదరాబాద్‌లో రెవెన్యూ ఉద్యోగుల సింహగర్జన సభ. తేదీ త్వరలో ప్రకటన

Teachers JAC leaders fired at CM KCR