అద్దె భవనాల్లోని గురుకులాల్లో విద్యార్థులకు ఇబ్బందులు : టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

అద్దె భవనాల్లోని గురుకులాల్లో విద్యార్థులకు ఇబ్బందులు : టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
  •     అద్దె రూపంలో ప్రభుత్వం 3,500 కోట్లు వృథా చేసింది: టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
  •     ఆ నిధులతో పక్కా భవనాలు పూర్తయ్యేవని వ్యాఖ్య 

హైదరాబాద్, వెలుగు: అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల బడుల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీచర్స్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. గత 12 ఏండ్లలో అద్దెల రూపంలోనే ప్రభుత్వం రూ.3,500 కోట్లు వృథా చేసిందన్నారు. మంగళవారం మండలిలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 1,030 గురుకులాల్లో.. 650కి పైగా గురుకులాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని.. వాటికి చెల్లించిన అద్దె డబ్బుతో పక్కా భవనాలు కట్టేవారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం పది మందికి ఒక బాత్రూం ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 30 మందికి ఒకటే దిక్కయిందన్నారు. 

దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. గురుకులాల టైమ్ టేబుల్ అస్తవ్యస్తంగా ఉందని.. సాయంత్రం 6.30 గంటలకే భోజనం పెట్టడం వల్ల ఉదయం వరకు దాదాపు 13 గంటల పాటు విద్యార్థులు ఖాళీ కడుపుతో అలమటిస్తున్నారని శ్రీపాల్ రెడ్డి వాపోయారు. మైనార్టీ గురుకులాల మాదిరిగా మిగతా వాటి టైమింగ్స్ కూడా మార్చాలని, రాత్రి వేళల్లో లేడీ టీచర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. 

విద్యాశాఖలో పర్యవేక్షణ పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు. 33 జిల్లాలకు ఐదారుగురు మాత్రమే రెగ్యులర్ డీఈవోలు ఉన్నారని.. 600 పైగా  మండలాలకు గానూ కేవలం 13 మందే ఎంఈవోలు ఉన్నారని వివరించారు. హెచ్ఎంలకు ఎంఈవో బాధ్యతలు ఇవ్వడం వల్ల స్కూల్స్, పర్యవేక్షణ రెండూ దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందిస్తూ.. గురుకులాల టైమ్ టేబుల్ మార్పుపై ఇప్పటికే కమిటీ వేశామని, త్వరలోనే శ్రీపాల్ రెడ్డి కోరిన విధంగా సమయపాలన మారుస్తామని హామీ ఇచ్చారు.