
మనం జీవితంలో ఏ కార్యాన్ని చేపట్టినా అది సఫలీకృతం కావడానికి, ఆ కార్యక్రమ లక్ష్యం సాధించబడడానికి పనితోపాటు పర్యవేక్షణ కూడా అవసరం. పర్యవేక్షణ అనేది కార్యసఫలతకు అవసరమైన పని విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి, తగిన వ్యూహాలను రూపొందించుకొని అనుసరించడానికి, నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడానికి దోహదపడే నిరంతర ప్రక్రియ.
పాఠశాల విద్యలో పర్యవేక్షణ అనేది కీలకచర్య. అది పాఠశాలల పనితీరును, మౌలిక వసతులను, ప్రధానోపాధ్యాయుల నాయకత్వ లక్షణాలను, ఉపాధ్యాయుల బోధనను, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే ప్రక్రియ. అందువల్లనే పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణ అవసరం.
అయితే, ఈ పర్యవేక్షణ ఎలా ఉండాలి? ఎవరు చేయాలి? అనే దానిపై ఒక సమగ్ర విధానం ఉండాలి. అంతేకానీ, ఎవరుపడితే వారు, ఎలాపడితే అలా తమ అధికార దర్పాన్ని ప్రదర్శించడానికో, కర్ర పెత్తనం చేయడానికో పర్యవేక్షణ జరపరాదు. పర్యవేక్షణ అంటే పరీక్షించడం కాదు.
హెడ్మాస్టర్లను, ఉపాధ్యాయులను మూల్యాంకనం చేయడం కాదు. క్రమశిక్షణ చర్యలు చేపట్టడం కాదు. ఈ ప్రస్తుత పరిస్థితిని అంచనావేస్తూ దానిని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన సహకారాన్ని అందించే ప్రక్రియగా గుర్తించాలి. పర్యవేక్షణ అనేది పర్యవేక్షణాధికారి, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుల మధ్య పరస్పర సహకారంతో జరిగే సమష్టికృత్యం. ఇది పారదర్శకంగా కొనసాగాలి.
పాఠశాలలో పర్యవేక్షణ ముఖ్యంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి పాఠశాల మౌలిక వసతులు, ఉపాధ్యాయుల బోధనా తీరు, విద్యార్థుల అభ్యసన ఫలితాలు. ఈ క్రమంలో హెడ్మాస్టర్లు, టీచర్లు, విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను గుర్తించి వాటి పరిష్కారానికై దోహదపడేలా పర్యవేక్షణ ఉండాలి.
విద్యాధికారుల పోస్టులు భర్తీ చేయాలి
విద్యాశాఖ వ్యవస్థను సమీక్షించి చూస్తే రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో, అనేక మండలాల్లో మండల విద్యాధికారుల పోస్టులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ల పోస్టులు, ఆఖరికి జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. వాటిని భర్తీచేయాల్సిన ప్రభుత్వం ఉమ్మడి సర్వీసు రూల్స్ పేరిట ఏమీ తేల్చకుండా కాలయాపన చేయడం విచారకరం.
ఆ పోస్టులను భర్తీ చేయకుండా సీనియర్ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసరుగా ఆదనపు బాధ్యతలు అప్పగించి, ఇప్పటికీ అప్పగిస్తూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. దానితో ఆయా అదనపు బాధ్యతలు చేపట్టిన ప్రధానోపాధ్యాయులు అటు తమ పాఠశాలలకు, ఇటు అదనపు బాధ్యత పదవికి సరైన న్యాయం చేయలేక సతమతమవుతున్నారు.
అదనపు బాధ్యతతో కొంతమంది హెడ్మాస్టర్లు తమ స్కూలు మొహమే చూడడం మానేశారు. ఏదో అప్పుడప్పుడు విజిట్‌కు వచ్చినట్లు తమ స్కూల్స్‌కు వచ్చి వెళ్తున్నారు. కొంతమంది హెడ్మాస్టర్లకైతే రెండు, మూడు మండలాల బాధ్యత కూడా అప్పగించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పాఠశాలల పర్యవేక్షణ ఎలా కొనసాగుతుందో ఊహించవచ్చు.
బోధనను విడిచిపెట్టి పర్యవేక్షణ
ఇదిలా ఉంటే విద్యాశాఖ ఇంకో సరికొత్త ఆలోచన చేసి మండల విద్యాధికారులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లతోపాటు స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, మండల నోడల్ ఆఫీసర్లు అంటూ మరికొంతమంది హెడ్మాస్టర్లను నియమించి పాఠశాలల పర్యవేక్షణ చేపట్టింది. అంటే పాఠశాలల పనితీరు, ఉపాధ్యాయుల బోధనను పర్యవేక్షించడానికి ఎంఈఓలు, డిప్యూటీ ఈడీలు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు, మండల నోడల్ ఆఫీసర్లు రెగ్యులర్‌గా ఉంటారు.
వీరితోపాటు జిల్లా విద్యాధికారులు, సెక్టోరియల్ ఆఫీసర్లు, రాష్ట్రస్థాయి విద్యాధికారులు కూడా పాఠశాలలను పర్యవేక్షిస్తారు. వీరితోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు కూడా పాఠశాలలను సందర్శించి పర్యవేక్షిస్తారు. ఇంతమంది ఉండగా వీరికితోడు ఇటీవల మన విద్యాశాఖ పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను కొంతమంది ఉపాధ్యాయులకు అప్పగిస్తూ జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీచేసింది. తరగతి గదిలో పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులు తమ బోధనను విడిచిపెట్టి ఇతర పాఠశాలల హెడ్మాస్టర్లు. ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించడం ఏవిధంగా సమర్థనీయమో ఆలోచించాలి.
బడికి దూరంగా ఉపాధ్యాయులు
ఇప్పటికీ SCERT, SSA, SIET, DSE, DEO కార్యాలయాలలో కొంతమంది ఉపాధ్యాయులు
డిప్యుటేషన్ మీద పనిచేస్తూ బడికి, బోధనకు దూరంగా ఉంటున్నారు. పాఠశాలలో బోధనకోసం నియామకం పొందిన టీచర్లను ఈవిధంగా బోధనకు, బడికి దూరం చేయడం విద్యాశాఖకే చెల్లింది. ఇప్పుడు పర్యవేక్షణ పేరుతో మరికొంతమంది టీచర్లను బోధనకు దూరం చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం సరైనదేనా?.
టీచర్లలో కొందరు బడికి, బోధనకు దూరంగా ఉంటూ జిల్లా, రాష్ట్ర కార్యాలయాల్లో పనిచేయడానికి ఆసక్తి కనబరచడం గమనార్హం. అందుకు తగిన పైరవీలు చేసుకుంటూ ఆయా కార్యాలయాలకు డిప్యుటేషన్ మీద వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. టీచరుగా నియామకం పొందిన వ్యక్తి బడిలో ఉండాలి, బోధన చేయాలి. హెడ్మాస్టరుగా ఉన్న వ్యక్తి పాఠశాలలో ఉండాలి, బడిని సక్రమంగా నడిపిస్తూ సమర్థ నాయకుడుగా పనిచేయాలి. అంటే, ఎవరి డ్యూటీ వాళ్లు చేయాలి.
బోధనేతర పనులు అప్పగించడం తప్పు
హెడ్మాస్టర్లను, టీచర్లను బడికి, బోధనకు దూరం చేయకుండా వారి స్థానంలో వారి విధులు వారు నిర్వర్తించేలా విద్యాశాఖ చర్యలు ఉండాలే తప్ప వారిని బడికి దూరం చేసే చర్యలు చేపట్టకూడదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం తప్పు. అయితే, పాఠశాలల పర్యవేక్షణ ఉండాలి.
అందుకోసం విద్యాశాఖ ప్రభుత్వంతో సంప్రదించి MEO. Dy. EO ల పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వాలి. పర్యవేక్షణాధికారులుగా వారే ఉండాలి. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలేగానీ, ఉపాధ్యాయులను పర్యవేక్షణాధికారులుగా నియమించడం సరికాదు.
ప్రస్తుతానికి ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉత్తర్వులను నిలిపివేసినా, భవిష్యత్తులో ఇలాంటి ఉత్తర్వులకు అవకాశం ఇవ్వకుండా పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీచేయాలి. విద్యారంగాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు.
-సుధాకర్ ఏ.వి,అడిషన్ జనరల్ సెక్రటరీ,ఎస్టీయూటీఎస్ –