
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీపీఎస్ విధానాన్ని అమలు చేసి, మాజీ సీఎం కేసీఆర్ ఉద్యోగుల ద్రోహిగా మారారని పలువురు టీచర్ల సంఘాల నేతలు విమర్శించారు. పాత పింఛన్ విధానం (ఓపీఎస్) లోకి వెళ్లేందుకు గత బీఆర్ఎస్ సర్కారుకు ఆప్షన్ ఉన్నా.. కేసీఆర్ సీపీఎస్ అమలుకు ఒప్పుకొన్నారని మండిపడ్డారు. సీపీఎస్‌తో టీచర్లు, ఉద్యోగులకు కలిగే కష్టనష్టాల గురించి తెలిపేందుకు ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద పీఆర్టీయూటీ ఆధ్వర్యంలో వివరణ దీక్ష నిర్వహించారు.
సంఘం గౌరవ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చెన్నయ్య మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీపీఎస్ విధానంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో సీపీఎస్ అమలు చేస్తామంటూ అప్పటి సీఎం కేసీఆర్ జీఓ 28 రిలీజ్ చేశారని తెలిపారు.
ఈ జీఓ తీసుకొచ్చిన ఆగస్టు 23న తెలంగాణ పింఛన్ విద్రోహ దినమని స్పష్టం చేశారు. ఈ దీక్షలో ఆర్‌యూపీపీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిములు, టీఎంఎస్ టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, పీఆర్టీయూటీ రాష్ట్ర నేతలు రత్నాకర్, చంద్రశేఖర్, వివిధ సంఘాల నేతలు లింగస్వామి, అబ్దుల్లా, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.