బదిలీల్లో స్పౌస్ కేటగిరీని దుర్వినియోగం చేసిన టీచర్లు

బదిలీల్లో స్పౌస్ కేటగిరీని దుర్వినియోగం చేసిన టీచర్లు

ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయుల బదిలీల్లో మంచి స్థానాలను దక్కించుకునేందుకు కొందరు టీచర్లు తప్పుడు విధానాలు అవలంబించారు. తమ గురించి ఎవరు తనిఖీ చేసి గుర్తిస్తారులే అని అనుకున్నారో ఏమోగాని కొందరు స్పౌస్ కేటగిరీని,  ప్రిఫరెన్స్ కేటగిరిని 2017 సాధారణ బదిలీల్లో మోసాలకు పాల్పడి దుర్వినియోగం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి తప్పుడు విధానాలు జరిగి ఉంటాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలోనే 11 మందికిపైగా 2017 బదిలీలల్లో మోసాలకు పాల్పడి లబ్ది పొందినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. లోతుగా విచారణ జరిపితే మరింత మంది బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రిఫరెన్స్ కేటగిరిలో బయటపడినవారు

  • 1.ఎస్. వెంకట రమణ యాదవ్, ఎస్జీటీ (ఎంపీపీఎస్, రాయమలుపురం)
  • 2.బి. వెంకటేశ్వర్లు, ఎస్జీటీ (ఎంపీపీఎస్, వెంకటేశ్వర పురం)

స్పౌస్ కేటగిరిలో..

  • ఎన్. వనజాక్షి, ఎస్జీటీ (ఎంపీపీఎస్, బ్రాహ్మణపల్లి)
  • పీవీ ఆనంద్ బాబు, ఎస్ఏ గణితం(జడ్పీ హైస్కూలు, మద్దూరు)
  • పి. ఉషారాణి, ఎస్ఏ ఇంగ్లీష్ (జడ్పీ హైస్కూల్, గోస్పాడు)
  • చంద్రశేఖర్, ఎస్ఏ ఇంగ్లీష్ (జడ్పీ హైస్కూలు, యరగుంట్ల)
  • ఎం. వెంకటలక్ష్మమ్మ, ఎస్ఏ, బీఎస్ (జడ్పీ హైస్కూల్, దీబగుంట్ల)
  • వై. వరలక్ష్మి, ఎస్ఏ, ఫిజికల్ సైన్స్ (జడ్పీ హైస్కూలు, కొండపల్లి)
  • శ్రీనివాసులు, ఎస్ఏ ఎస్ఎస్ (జడ్పీ హైస్కూల్, రాజనగరం)
  • వెంకట నిర్మల, ఎస్జీటీ (ఎంపీపీఎస్, చాబోలు)
  • ఆలియా బేగం, ఎస్ఏ ఇంగ్లీష్ (జడ్పీ హైస్కూల్, ఈర్నపాడు).

వీరంతా గుట్టు చప్పుడు కాకుండా మంచి స్థానాల్లో చేరిపోయారు.  2017 బదిలీల్లో తాము అడ్డదోవలో బదిలీలు పొందినా ఎవరూ గుర్తించలేదన్న ధీమాతో గత ఏడాది 2020 సాధారణ బదిలీల్లోనూ వీరిలో కొందరు.. వీరిని చూసి ఇంకొందరు తిరిగి అదే తరహా మోసాలకు పాల్పడ్డారు. స్పౌస్ కేటగిరి మరియు ప్రిఫరెన్స్ కేటగిరీలో, స్పౌస్ కేటగిరితోపాటు ఇతర కేటగిరిలలో కూడా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలు గుప్పు మన్నాయి. దీంతో బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.సతీష్ కుమార్, బీటీఎఫ్ నేతలు జయపాల్, మౌలిబాషా, మల్లికాబి కబీర్, వెంకటస్వామి తదితరులు అప్రమత్తమై పక్కా ఆధారాలు సేకరించారు. సమాచార హక్కు చట్టం కింద ఆధారాలు ధృవీకరించుకుని నేరుగా విద్యాశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.  దీనిపై స్పందించిన విద్యాశాఖ కమిషనర్ దోషులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఏం జరిగిందో కాని దోషులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. అంతేకాదు విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల అమలులోకే రాలేదు. దీంతో మళ్లీ 2020 సాధారణ బదిలీలల్లో కూడా కొందరు ఉపాధ్యాయులు మోసాలకు పాల్పడ్డారు. ఉదాహరణకు కర్నూలు జిల్లా మహానంది మండలంలో చక్రపాణి అనే ఎస్జీటీ ఉపాధ్యాయులు స్పౌస్ కేటగిరి వాడుకొని తన భార్య పనిచేసే మహానంది మండలంలో ఆప్షన్ ఇవ్వలేదు. ఫలితంగా మల్లికాబి అనే ఎస్జీటీ ఉపాధ్యాయురాలికి అన్యాయం జరిగింది. చక్రపాణి, మహానంది ఎంఇఓ రామసుబ్బయ్య కలిసి చేసిన తప్పిదాల వల్ల తన భర్త పనిచేసే బి. కోడూరులో పోస్టింగ్ రాలేదని మల్లికాబి ఆవేదన వ్యక్తం చేశారు.  అక్రమంగా బి. కోడూరు వచ్చిన చక్రపాణి పై చర్యలు తీసుకొని స్పోస్ కేటగిరి వినియోగించిన తనకు తన భర్త పనిచేస్తున్న బి. కోడూరు లో పోస్టింగ్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన అధికారులు చక్రపాణి అనే టీచర్ తప్పు చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని కడప ఆర్జేడీ వెంకట కృష్ణారెడ్డి డీఈఓ కర్నూల్ ను అదేశించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అధికారుల అలసత్వం ప్రభుత్వ విద్యావ్యవస్థకు కళంకం అంటించడమే కాదు.. ప్రభుత్వ లక్ష్యాన్ని తూట్లుపొడిచినట్లు అవుతోందంటూ మోసాలకు పాల్పడిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసు నమోదు చేయించాలంటూ బీటీఎఫ్ సంఘం అధ్యక్షులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీటీఎఫ్ నేతలు జయపాల్, మౌలిబాషా, మల్లికాబి కబీర్, వెంకటస్వామి తదితరులు కలసి డీఈఓ సాయిరాం వినతిపత్రాలు సమర్పించారు.

ఇవి కూడా చదవండి

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

వీడియో: 12 అంతస్తులపై నుంచి జారిపడ్డ పాప.. క్యాచ్ అందుకున్న డెలివరీ బాయ్

అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం

ఆనంద్ మహీంద్రా ట్వీట్: ఇది ఎలిఫెంట్ కాదు.. ఎలీ-ప్యాంట్