
ముంబై : టీ20లకు ఆదరణ పెరగడంతో వన్డే క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడిందనుకోవడం హాస్యాస్పదమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. వన్డే క్రికెట్ వల్లే తనకు ఇంత పేరొచ్చిందని అభిప్రాయపడ్డాడు. ‘వన్డే క్రికెట్‌తోనే నేను ఇంత పేరు సంపాదించా. ఈ ఫార్మాట్ పనైపోయిందనడం అంతా బేకార్ ముచ్చట. గతంలో టెస్టు క్రికెట్ గురించి ఇలానే మాట్లాడారు. నా వరకు ఫార్మాట్ కాదు క్రికెట్టే ముఖ్యం.
వన్డే క్రికెట్ పనైపోతుందని, టీ20లు ముగిసిపోతాయని, టెస్టులకు కాలం చెల్లిందని నేను అస్సలు చెప్పను. అవసరం అయితే ఇంకో ఫార్మాట్ కూడా ఉండాలని కోరుకుంటా. నాకు క్రికెట్ ఆడటమే ముఖ్యమైన విషయం. ఏ ఫార్మాట్ ఆడాలి, ఏది ఆడకూడదనేది వ్యక్తుల ఇష్టం. నా వరకైతే మూడు ఫార్మాట్లూ ముఖ్యమే’ అని రోహిత్ స్పష్టం చేశాడు.