Team india: వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ విడుదల చేసింది. టీమిండియా 118 పాయింట్లతో మరోసారి తన నెంబర్– 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాలోనూ భారత జట్టే అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ గెలవడంతో పొట్టి ఫార్మాట్‌లోనూ మెన్ ఇన్ బ్లూ పై చేయి సాధించింది. కాగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించిన భారత్.. తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో సెకండ్ స్థానంలో నిలవగా, 109 పాయింట్లతో ఆస్ట్రేలియా 3వ ప్లేస్ లో కొనసాగుతోంది.
అద్భుతమైన ప్రదర్శనలతో వరుస గెలిచిన సౌతాఫ్రికా 102 పాయింట్లతో 4వ స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో పాకిస్థాన్(98)ని వెనక్కి నెట్టింది. ఇదిలా ఉంటే, ఇదొక్కటి తప్పించి టాప్– 10 జట్ల జాబితాలో ఎలాంటి మార్పులు లేవు. శ్రీలంక(96), అఫ్గానిస్థాన్(93), ఇంగ్లాండ్(89), బంగ్లాదేశ్(84), వెస్టిండీస్(74) పాయింట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అలాగే ఐర్లాండ్ 54 పాయింట్లతో 11వ స్థానానికి చేరి జింబాబ్వేను వెనక్కి నెట్టేసింది. జింబాబ్వే 53 పాయింట్లతో 12వ స్థానంలో ఉంది. మరోవైపు అమెరికా 46 పాయింట్లతో 13వ స్థానానికి ఎగబాకి స్కాట్లాండ్ కంటే ముందుకు వచ్చింది.
కాగా ఐసీసీ ప్రకటించిన రూల్స్ ప్రకారం 2027 మార్చి 31వ తేదీ నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ –8లో నిలిచే జట్లు నేరుగా వన్డే వరల్డ్ కప్ 2027కు అర్హత సాధించనున్నాయి. ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వే ఇప్పటికే టోర్నీకి నేరుగా అర్హత పొందినప్పటికీ, దక్షిణాఫ్రికా టాప్ 8లోనే కొనసాగితే 9వ స్థానంలో ఉన్న మరో టీమ్ కి ఛాన్స్ లభించనుంది. దీంతో ప్రస్తుతం 9వ స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది.
Key ramifications for the @cricketworldcup 2027 qualifications in the annual ICC Men's ODI Team Rankings update 👀https://t.co/2xMlGGRUcN
— ICC (@ICC) May 11, 2026
