
ముంబైలోని బీసీసీఐ ఆఫీస్ లో భారత క్రికెట్ జట్టు సెలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, ఇతర సెలెక్టర్ల బృందం, జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధికారులు హాజరయ్యారు.
వరల్డ్ కప్ మెగా టోర్నమెంట్ తర్వాత… టీమిండియా మరో విదేశీ పర్యటనకు సిద్ధమవుతోంది. వెస్టిండీస్ లో భారత జట్టు పర్యటన వచ్చే నెల మొదటివారంలో ప్రారంభం కానుంది. ఆగస్ట్ 3 నుంచి సెప్టెంబర్ 3 వరకు నెలరోజులపాటు కరీబియన్ దీవుల్లో పర్యటిస్తుంది టీమ్ ఇండియా. ఈ పర్యటనలో 3 టీట్వంటీలు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనుంది భారత జట్టు.
మహేంద్రసింగ్ ధోనీ వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు.. తన పేరును పరిశీలించొద్దని కోరుతూ బీసీసీఐకు శనివారం లెటర్ రాశాడు. దీంతో.. ధోనీ వెస్టిండీస్ టూర్ టీమ్ లో ఉండడని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. రాబోయే రెండు నెలలు ఆర్మీలోని తన పారామిలటరీ రెజిమెంట్ లో పనిచేస్తానని బోర్డుకు సమాచారం ఇచ్చాడు ధోనీ. వెస్డిండీస్ టూర్ తర్వాత ప్రారంభమయ్యే క్రికెట్ టోర్నమెంట్ కు కూడా ధోనీ దూరంగా ఉండే సూచనలు ఉన్నాయి.