
- మిడిలార్డర్‌పై ఫోకస్
- నేడు కివీస్ తో రెండో టీ20
- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో
రాంచీ: కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో తొలి విజయం సొంతం చేసుకున్న టీమిండియా సిరీస్ విజయమే లక్ష్యంగా మరో పోరాటానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగే రెండో టీ20లో రోహిత్ సేన న్యూజిలాండ్‌తో తలపడనుంది. తొలి టీ20 గెలిచి 1–0తో లీడ్‌లో ఉన్న ఇండియా.. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హోమ్‌టౌన్ రాంచీలోనే సిరీస్ పట్టేయాలని భావిస్తోంది. సిరీస్‌లో లీడ్‌లో ఉన్నందున రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో ప్రెజర్ లేకుండా బరిలోకి దిగనుంది. రోహిత్, రాహుల్, సూర్యకుమార్‌తో కూడిన టాపార్డర్ ఫామ్ కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. కానీ తొలిపోరులో ఆకట్టుకోలేకపోయిన మిడిలార్డర్ గాడిలో పడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్‌పైనే ఇండియా మేనేజ్‌మెంట్ ఫోకస్ పెట్టనుంది. శ్రేయస్ అయ్యర్ తడబాటు కొనసాగగా .. ఫస్ట్ టీ20లో రిషబ్ పంత్ కావాల్సినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతో సులువుగా పూర్తి కావాల్సిన మ్యాచ్ చివరి ఓవర్‌దాకా వెళ్లి టెన్షన్ పెట్టింది. ఈ నేపథ్యంలో శ్రేయస్‌ను కొనసాగిస్తారా లేదంటే రుతురాజ్, ఇషాన్ కిషన్‌లో ఒకరికి చాన్స్ ఇస్తారో చూడాలి. యంగ్‌స్టర్స్‌తో తీవ్ర పోటీ నేపథ్యంలో మరోసారి ఫెయిలైతే శ్రేయస్‌పై వేటు తప్పకపోవచ్చు. ఇక, జైపూర్‌లో డెబ్యూ చేసిన వెంకటేశ్ అయ్యర్‌కు బౌలింగ్ చేసే చాన్స్ రాలేదు.. బ్యాటింగ్‌లో రెండు బాల్సే ఎదుర్కొన్న నేపథ్యంలో తనని కొనసాగించనున్నారు. బౌలింగ్‌లో భువనేశ్వర్ ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద అడ్వాంటేజ్. భువీ అదే జోరు కొనసాగించాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటుంది. ఇక, అక్షర్ పటేల్ గాడిలో పడాల్సి ఉండగా సీనియర్ అశ్విన్ ఫామ్ కలిసొచ్చే అంశం. అయితే, పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. తొలి టీ20లో బాల్ తగిలి సిరాజ్ ఎడమ చేతి వేళ్లకు బలమైన గాయమైంది. అతని ప్లేస్‌లో యంగ్ పేసర్లు హర్షల్ పటేల్, అవేశ్ లో ఒకరికి అవకాశం రానుంది.
ఒత్తిడిలో కివీస్...
సిరీస్ ఆశలు సజీవంగా నిలబెట్టుకోవాలని చూస్తున్న కివీస్ కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే, తొలి మ్యాచ్‌లో చాలా వరకు తేలిపోయిన బ్లాక్‌క్యాప్స్ టీమ్‌పై ఈ మ్యాచ్‌లో ఒత్తిడి ఉండనుంది. బ్యాటింగ్‌లో కివీస్‌కు పెద్దగా సమస్యల్లేవు. బౌలర్లు పుంజుకోవడంపైనే ఆ జట్టు గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. రచిన్ రవీంద్ర ప్లేస్‌లో సీనియర్ ఆల్‌రౌండర్ నీషమ్‌ను, శాంట్నర్‌కు తోడుగా స్టార్ స్పిన్నర్ ఇష్ సోధీని ఈ మ్యాచ్‌లో బరిలోకి దింపే అవకాశం ఉంది. అయితే, కివీస్ బోర్డు కెప్టెన్సీ రొటేషన్ పాలసీ అమలు చేస్తుందంటూ వార్తలు రావడంతో సౌథీ నుంచి పగ్గాలు వేరే వాళ్లకి అప్పగిస్తారేమో చూడాలి. ఇక, జైపూర్ మాదిరిగా రాంచీలోనూ మంచు ప్రభావం తీవ్రంగా ఉండనుంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోనుంది.