ప్రాక్టీస్‌‌ మొదలు పెట్టిన టీమిండియా

ప్రాక్టీస్‌‌ మొదలు పెట్టిన టీమిండియా
  •   నేటి నుంచి వామప్‌‌ మ్యాచ్‌‌లు

మూడో వరల్డ్‌‌కప్‌‌ ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా ఇంగ్లండ్‌‌లో అడుగుపెట్టిన టీమిండియా అందుకోసం సన్నాహకం మొదలుపెట్టింది. బుధవారమే లండన్‌‌ చేరుకున్న కోహ్లీసేన క్షణం కూడా వృథా చేయకూడదని భావిస్తున్నట్టుంది. అందుకే విశ్రాంతి కూడా తీసుకోకుండా వెంటనే మైదానంలోకి వచ్చింది. గురువారం రెస్ట్‌‌ తీసుకునే వెలుసుబాటు ఉన్నా.. ఆటగాళ్లంతా తొలి ప్రాక్టీస్‌‌ సెషన్‌‌ పాల్గొన్నారు. కోహ్లీ, ధోనీతో పాటు మిగతా ఆటగాళ్లంతా ఓవల్‌‌ గ్రౌండ్‌‌లో సాధన చేశారు. ఐపీఎల్‌‌లో వేర్వేరు జట్లకు ఆడిన క్రికెటర్లు దాదాపు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ ఒక్కచోటుకు చేరుకున్నారు. గ్రౌండ్‌‌లోకి రాగానే ప్లేయర్లందరితో కోచ్‌‌ రవిశాస్త్రి మాట్లాడాడు. అనంతరం క్రికెటర్లు వామప్‌‌లో మునిగిపోయారు. కెప్టెన్‌‌ కోహ్లీ, ధోనీతో పాటు మిగతా ఆటగాళ్లంతా నెట్స్‌‌లో బ్యాటింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేశారు. బుమ్రా, భువీ తదితరులు వారికి బౌలింగ్‌‌ చేశారు.  అలాగే,  ఆటగాళ్లు ఫుట్‌‌బాల్‌‌ ఆడుతూ, క్యాచ్‌‌లు ప్రాక్టీస్‌‌ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. ధోనీ టెన్నిస్‌‌ ఆడుతూ సందడి చేశాడు.

ప్రాక్టీస్‌‌ సెషన్‌‌ ముగిసిన తర్వాత కోహ్లీ.. అన్ని జట్ల కెప్టెన్ల సమావేశానికి హాజరయ్యాడు. కాగా, వరల్డ్‌‌కప్‌‌ వామప్‌‌ మ్యాచ్‌‌లు శుక్రవారం మొదలవనున్నాయి. తొలి రోజు అఫ్గానిస్థాన్​తో పాకిస్థాన్​, శ్రీలంకతో సౌతాఫ్రికా తలపడతాయి. శనివారం  న్యూజిలాండ్​–ఇండియా, ఇంగ్లండ్​–ఆస్ట్రేలియా వామప్‌‌ మ్యాచ్​లు ఉంటాయి. ఈనెల  28వ తేదీ వరకు మొత్తం పది వామప్స్‌‌లో అన్ని జట్లు తలో రెండు ప్రాక్టీస్‌‌ మ్యాచ్‌‌ల్లో పాల్గొంటాయి. అన్ని  మ్యాచ్‌‌లు ఇండియా టైమ్‌‌ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతాయి. ఇండియా తన రెండో వామప్​ను బంగ్లాదేశ్​తో 28న ఆడనుంది.