మూడు మ్యాచ్‌ల సిరీస్ 2-0తో సొంతం
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : టీమిండియా టార్గెట్ 312. నలభై ఓవర్లు ముగిసే సరికి స్కోరు 212/5. మరో పది ఓవర్లలో వంద పరుగులు చేయాలి. ప్రధాన బ్యాటర్లంతా వెనుదిరిగారు. చేతిలో ఐదు వికెట్లే ఉన్నాయి. అటువైపు విండీస్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూనే ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో అక్షర్ పటేల్ ( 35 బాల్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 64 నాటౌట్) ఇండియాకు ఆపద్బాంధవుడయ్యాడు. ఓవైపు సాధించాల్సిన రన్‌రేట్.. మరోవైపు ఒత్తిడి పెరుగుతున్న టైమ్‌లో తనలోని హిట్టర్‌ను నిద్రలేపాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో భారీ సిక్సర్లు కొట్టాడు. దాంతో, సోమవారం తెల్లవారుజాము వరకు ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో టీమిండియా రెండు వికెట్ల తేడాతో గెలిచింది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ తొలుత 50 ఓవర్లలో 311/6 స్కోరు చేసింది. కెరీర్‌లో వందో మ్యాచ్ ఆడుతున్న ఓపెనర్ షై హోప్ (115) సెంచరీతో సత్తా చాటాడు. కెప్టెన్ పూరన్ (74) రాణించాడు. ఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ (3/54) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇండియా 49.4 ఓవర్లలో 312/8 స్కోరు చేసి నెగ్గింది. అక్షర్ తో పాటు శ్రేయస్ అయ్యర్ (63), సంజూ శాంసన్ (54), శుభ్‌మన్ గిల్ (43) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్(2/46), కైల్ మైయర్స్ (2/48) చెరో రెండు వికెట్లు తీశారు. ఓ వికెట్ కూడా పడగొట్టిన అక్షర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మూడో వన్డే బుధవారం జరుగుతుంది.
