టీం ఇండియా వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ శ్రీలంక సిరీస్ కి దూరం అయ్యాడు. మంగళవారం ముంబైలో శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో బౌండరీ ఆపే ప్రయత్నంలో ఎడమ మోకాలికి గాయం చేసుకున్నాడు. నొప్పి ఎక్కువగా ఉండటంతో స్కాన్ తీశారు. దీంతో నిపుణుల సలహా మేరకు మిగిలిన మ్యాచ్ లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. శాంసన్ కి స్థానంలో జితేశ్ శర్మని టీం లోకి తీసుకున్నారు.
గత ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరుపున బరిలోకి దిగిన జితేశ్ 234 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఎన్నాళ్లనుంచో జట్టులో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్న శాంసన్ కి ఈ సిరీస్ మంచి అవకాశం అని భావించారంతా. కానీ, మొదటి మ్యాచ్ లో నాలుగవ స్థానంలో వచ్చిన శాంసన్ కేవలం 5 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అయితే, ఇవాళ జరగబోయే మ్యాచ్ లో ఎన్నాళ్లనుంచో బేంచ్ కే పరిమితమై, తుది జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న రాహుల్ త్రిపాఠిని ఆడిపిస్తారా లేక సంజూ స్థానంలో జట్టులోకి తీసుకున్న జితేశ్ కి చాయిస్ ఇస్తారా అన్నది తెలియాల్సి ఉంది.