
- ఇక్కడే డేటా సెంటర్
- గిగావాట్ కెపాసిటీతో నిర్మాణం
- 30 వేల మందికి ఉపాధి2028లో మొదలయ్యే చాన్స్
న్యూఢిల్లీ:టెక్ కంపెనీ గూగుల్ భారతదేశంలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ ఏర్పాటు కోసం 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.33 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం తెలిపింది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ భాగస్వామ్యంతో గిగావాట్ కెపాసిటీ గల డేటా సెంటర్‌ను నిర్మించనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో గూగుల్ ఢిల్లీలో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న ఈ ఏఐ హబ్, అమెరికా వెలుపల గూగుల్‌కు అతిపెద్దది. ఇందులో రెన్యువబుల్ఎనర్జీతో నడిచే డేటా సెంటర్, ఫైబర్- ఆప్టిక్ నెట్‌వర్క్ ఉంటాయి. మొత్తం 30 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
2028 నాటికి ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2028-–32 మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా రూ.10,518 కోట్లు సమకూరుతుంది. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలోపు15 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించారు. భారతదేశంలో ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, గూగుల్లాగే ఇతర అమెరికన్ టెక్ కంపెనీలు కూడా పెట్టుబడులను పెంచుతున్నాయి. అమెజాన్ 2030 నాటికి క్లౌడ్ మౌలిక సదుపాయాలలో 12.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.
చాట్‌జీపీటీ గిగావాట్ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. మైక్రోసాఫ్ట్ భారతదేశంలో డేటా సెంటర్లను విస్తరిస్తోంది. గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీ కూడా డేటా సెంటర్ సామర్థ్యాన్ని పెంచడానికి పెట్టుబడులు ప్రకటించారు.
ఎయిర్టెల్ భాగస్వామ్యం
ఈ ప్రాజెక్ట్ కోసం టెలికం ఆపరేటర్ ఎయిర్టెల్ బలమైన ఇంట్రా-సిటీ, ఇంటర్-సిటీ ఫైబర్ నెట్‌వర్క్‌ను నిర్మిస్తామని ప్రకటించింది. ఈ అధిక-సామర్థ్యం, లోలేటెన్సీ నెట్‌వర్క్ వల్ల గూగుల్ వినియోగదారులకు మేలు జరుగుతుందని పేర్కొంది. ఇది దేశవ్యాప్తంగా డిజిటల్ ఇన్క్లూజివిటీని పెంచుతుందని భారతీ ఎయిర్టెల్ వైస్ చైర్మన్ ఎండీ గోపాల్ విఠల్ చెప్పారు. విశాఖపట్నం గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతోందని తెలిపారు.
సబ్సబీ కేబుల్స్‌ను నెట్‌వర్క్‌కు లింక్ చేయడానికి కేబుల్ ల్యాండింగ్ స్టేషన్నూ నిర్మిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉంటే, గౌతమ్ అదానీకి చెందిన అదానీ కానెక్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన బిల్డింగ్ వంటి మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే నిర్మాణాన్ని కూడా చేపడతారు.
గూగుల్ ప్రకటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'ఎక్స్'లో స్పందించారు. ఈ భారీ పెట్టుబడి వికసిత్ భారత్ నిర్మాణ దృష్టికి అనుగుణంగా ఉందని తెలిపారు. ఇది టెక్నాలజీ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో శక్తివంతమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.