
న్యూఢిల్లీ: ఏప్రిల్లో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సెమీస్ మ్యాచ్లో పీవీ సింధుపై అన్యాయంగా పెనాల్టీ విధించినందుకు బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ చైర్మన్ చీ షెన్ చెన్..ఆమెకు క్షమాపణలు చెప్పారు. ‘ఇది మానవ తప్పిదం. దాన్ని సరిదిద్దే అవకాశం ఇప్పుడు లేదు. ఇలాంటివి రిపీట్ కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటాం. సింధుకు కలిగిన అసౌకర్యానికి మేం క్షమాపణలు చెబుతున్నాం. ఇది క్రీడలో ఓ భాగమని, దానిని అంగీకరిస్తున్నట్లు మేం ఒప్పుకుంటున్నాం’ అని షెన్ చెన్ పేర్కొన్నారు. నాడు యమగూచి (జపాన్)తో జరిగిన సెమీస్ లో సింధు రెండో గేమ్‌లో 14–11 ఆధిక్యంలో ఉన్న దశలో సర్వీస్ చేయడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నదనే ఉద్దేశంతో అంపైర్ ఆమెపై ఓ పాయింట్ పెనాల్టీ విధించాడు. దీనిపై సింధు రిఫరీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దీంతో లయ తప్పి మ్యాచ్‌ను కోల్పోయిన ఇండియా షట్లర్ కన్నీళ్ల పర్యంతమైంది.