సమాజానికి మేలు చేసేలా టెక్నాలజీ వాడాలి ..గవర్నర్ జిష్ణుదేవ్వర్మ

సమాజానికి మేలు చేసేలా టెక్నాలజీ వాడాలి ..గవర్నర్ జిష్ణుదేవ్వర్మ

గచ్చిబౌలి, వెలుగు: సమాజానికి మేలుచేసేలా, తోటి వారికి సేవ చేసేలా టెక్నాలజీని ఉపయోగించాలని గవర్నర్​ జిష్ణుదేవ్​వర్మ సూచించారు. హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవం మంగళవారం అట్టహాసంగా జరిగింది. గచ్చిబౌలి బ్రహ్మకుమారీస్​లోని గ్లోబల్​పీస్​​ఆడిటోరియంలో ఈ వేడుక నిర్వహించగా భారత్ బయోటెక్​ ఎగ్జిక్యూటివ్​ చైర్మన్​ కృష్ణ ఎల్లాతో పాటు గవర్నర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

990 మంది స్టూడెంట్స్​కు గవర్నర్​ పట్టాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మేధస్సును పెంచడమే అంతిమ లక్ష్యం కావాలని అంబేద్కర్​ మాటలను గుర్తుచేశారు. పట్టాలు అందుకున్న వారు ఇతరులకు అవకాశాలు సృష్టించేలా ఎదగాలని ఆకాంక్షించారు. భారత్​ బయోటెక్​ వ్యవస్థాపకుడు కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. యువత ఆవిష్కరణలు, నైపుణ్యాలపై దృష్టి పెట్టాలన్నారు. 

అనంతరం హెచ్​సీయూ వైస్​చాన్స్​లర్​ బీజే రావు ఎంఏ పొలిటికల్​ సైన్స్​లో పట్టా అందుకున్న గోపి తేజస్వీకి ఓబీసీ కేటగిరీలో గోల్డ్​ మెడల్, ఐదుగురు ప్రొఫెసర్లకు చాన్స్​లర్​ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్​సీయూ చాన్స్​లర్​ డాక్టర్​ ఎల్.నర్సింహారెడ్డి, పలు విభాగాల డీన్​లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.