కాంగ్రెస్‌లో చేరిన తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి

కాంగ్రెస్‌లో చేరిన  తీగల కృష్ణారెడ్డి, అనితారెడ్డి

బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటుగా ఆయన కొడలు, రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి కూడా హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన  గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సమక్షంలో వీరు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి  ఆహ్వానించారు దీపా దాస్‌మున్షీ.  తీగల కృష్ణారెడ్డి పార్టీ మారుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం నడుస్తుంది.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డిని వీరు మర్యాదపూర్వకంగా కలిశారు.  దీంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.  

 టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి తీగల ..  2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మళ్లీ మహేశ్వరం నుంచే పోటీ చేసి కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన మల్ రెడ్డి రంగారెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో మహేశ్వరం నుండే టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో మళ్లీ ఓడిపోయారు. కృష్ణారెడ్డి కోడలు తీగల అనితా రెడ్డి కూడా బీఆర్ఎస్ తరపును జడ్పీటీసీగా గెలిచి రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌ అయ్యారు.