పొన్నం ప్రభాకర్, కేటీఆర్లకు కండ కావరం ఎక్కువైంది: బండి సంజయ్

పొన్నం ప్రభాకర్, కేటీఆర్లకు కండ కావరం ఎక్కువైంది: బండి సంజయ్

కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ పేరుతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప చేసిందేమిలేదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి కేటీఆర్ లకు కండ కావరం ఎక్కువైందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా  కోహెడ మండల కేంద్రంలో ప్రజాహిత యాత్ర ప్రారంభం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రసంగించారు.

24 గంటలు తనను తిట్టడమే వాళ్లు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజలకు తాము ఏం చేశారో చెప్పుకోలేని దద్దమ్మలని మండిపడ్డారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తానేం చేశానో చెప్పడానికే యాత్ర చేస్తున్నానని చెప్పారు. అయోధ్యలో రామ మందిరం కట్టడం తప్పా? జై శ్రీరాం అనడం తప్పా?... కాంగ్రెస్ నేతలు స్పష్టం చేయాలని ప్రశ్నించారు. మోదీని ప్రధాని చేయకపోతే.. రామ మందిరం బాబ్రీ మసీదుగా మారే ప్రమాదముందని చెప్పారు.

కరీంనగర్ నుంచి వరంగల్అలాగే కరీంనగర్ నుంచి జగిత్యాల వరకు రోడ్డు విస్తరణకు నిధులు తెచ్చిందెవరని.. శాతవాహన వర్శిటీకి 12 బి, ఎస్సారార్ కాలేజీకి అటానమస్ హోదా తెచ్చిందెవరు?.. కాంగ్రెస్ పాలనలో, పొన్నం ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకు సమాధానమివ్వాలని బండి సంజయ్ ప్రశ్నించారు. పీఎం సడక్ యోజన కింద గూండారెడ్డిపల్లి నుంచి ముత్తన్నపల్లి వరకు రూ. 3 కోట్ల 74 లక్షలతో బీటీ రోడ్డు వేశామని తెలిపారు. దాంతో పాటు ఆయన చేసిన అభివృద్ధి పనులను పూసగుచ్చినట్లు ప్రజలకు వివరించారు. ప్రమాణ పూర్వకంగా చెబుతున్నానని.. ఇప్పుడు తాను చెప్పినవన్నీ సర్కారు లెక్కలేని పేర్కొన్నారు. తాను చెప్పిన లెక్కలన్నీ తప్పయితే.. తపై కేసు పెట్టొచ్చని చెప్పారు బండి సంజయ్. 

మరి హుస్నాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ చేసిందేమిటో చెప్పాలన్నారు బండి సంజయ్. వంద రోజుల్లో మహిళలకు నెలనెలా రూ.2500లు ఇస్తానన్నారు.. ఎందుకివ్వలేదని.. రైతు బంధు కింద ఎకరాకు రూ.15 వేలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. ప్రజల కోసం తాము కొట్లాడినమని.. రెండుసార్లు జైలుకు పంపుతారా.. ప్రజల కోసం కొట్లాడితే… నాపై వంద కేసులు పెట్టినా లెక్క చేయలేదన్నారు బండి సంజయ్. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాదిరిగా తాను ఇంట్లో కూర్చోలేదని.. 150 రోజులపాటు 1600 కి. మీల పాదయాత్ర చేశానని.. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచానన్నారు బండి సంజయ్. కేసీఆర్ ను గద్దెదించేదాకా పోరాడింది బీజేపీయేనని.. కాంగ్రెస్ నేతలు ఏం చేశారని ఓట్లేశారని ప్రశ్నించారు. కేంద్రం రాష్ట్రానికి నిధులిస్తే ప్రజలకివ్వకుండా దారి మళ్లించి నీచులు బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. మోదీ ప్రధాని కావాలా? రాహుల్ ప్రధాని కావాలా? ప్రజలే ఆలోచించాలన్నారు ఎంపీ బండి సంజయ్.