కేసీఆర్​ కుటుంబ పాలన అంతానికి యువత రాజకీయాల్లోకి రావాలి: తీన్మార్ మల్లన్న

కేసీఆర్​ కుటుంబ పాలన అంతానికి యువత రాజకీయాల్లోకి రావాలి: తీన్మార్ మల్లన్న

ములకలపల్లి, వెలుగు: రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేసేందుకు యువత రాజకీయాల్లో రాణించాలని తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో పాదయాత్ర నిర్వహించారు. రింగిరెడ్డిపల్లి నుంచి ములకలపల్లి మీదుగా మాదారం, సత్యంపేట, రామాంజనేయపురం, మామిళ్లగూడెం, గుట్టగూడెం, చాపరాలపల్లి, రామచంద్రాపురం వరకు  పాదయాత్ర కొనసాగింది. ములకలపల్లి మెయిన్ సెంటర్​లో ఏర్పాటు చేసిన సభలో మల్లన్న మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం అయ్యాక రూ.20లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు.

చదువులేని ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కేసీఆర్ పూర్తిగా విఫలం అయ్యారన్నారు. తాను ఎమ్మెల్సీగా ఓడిపోయినా, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నానన్నారు. రీకాల్ ద్వారా ప్రజలు తమ ఓట్లతో గద్దె దింపేలా చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం మోటార్ల కొనుగోళ్లకు రూ.1600 కోట్లు ఖర్చు చేశారని, ఆ మోటార్లు బిగించేందుకు కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి రూ.7,600 కోట్లు చెల్లించడంపై విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు. సీఎం కేసీఆర్ తనపై 51 కేసులు పెట్టించారని, ఎన్ని పెట్టినా ప్రశ్నించడం ఆపనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఫాంహౌస్ కే పరిమితం చేసేలా తీర్పు ఇవ్వాలని కోరారు. అనంతరం మున్నూరు కాపు మండల కమిటీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్నను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మండల నాయకులు పువ్వాల మంగపతి, మేకల వెంకటేశ్వర్లు, పుష్పాల చందర్రావు, బుగ్గారపు సత్యనారాయణ, సీతారాములు, శ్రీరాముల నాగేశ్వరరావు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.