హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలితో గుర్తింపు పొందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్) రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉప్పల్‌లోని తన ఆఫీస్లో మీడియాతో మల్లన్న మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆధ్వర్యంలో జరిగే ఈ పాదయాత్ర ప్రధానంగా బీసీలు, వెనుకబడిన వర్గాలకు రాజకీయ అధికారమే లక్ష్యంగా సాగనున్నట్లు పేర్కొన్నారు.
సామాజిక న్యాయం, రాజకీయ చైతన్యం ప్రధాన అజెండా అన్నారు. యాత్రకు సంబంధించిన జిల్లాలు, రూట్ మ్యాప్ ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. గతంలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైన తన పాదయాత్రను ఈసారి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు. మల్లన్న పాదయాత్ర రాజకీయంగా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
