Mirai Box Office: ‘మిరాయ్’ 3 డేస్ కలెక్షన్స్.. సరిహద్దులను బద్దలు కొడుతున్న తేజ సజ్జా.. గ్రాస్, నెట్ ఎంతంటే?

Mirai Box Office: ‘మిరాయ్’ 3 డేస్ కలెక్షన్స్.. సరిహద్దులను బద్దలు కొడుతున్న తేజ సజ్జా.. గ్రాస్, నెట్ ఎంతంటే?

తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ ఫ్యాంటసీథ్రిల్లర్ కు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో కలెక్షన్ల సంఖ్య పెరుగుతుంది. గత శుక్రవారం (సెప్టెంబర్ 12) థియేటర్లలో విడుదలైన ఈ మూవీ రెండ్రోజుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుంది.

ఈ క్రమంలోనే ఇవాళ (సెప్టెంబర్ 15న) మిరాయ్ 3 డేస్ బాక్సాఫీస్ వసూళ్ల పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.81.20 కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసినట్లు తెలిపారు.

‘‘దక్షిణం నుండి ఉత్తరం వరకు, భారతదేశం నుండి విదేశాల వరకు, మిరాయ్ ప్రతిచోటా చరిత్రను తిరగరాస్తోంది. బ్రహ్మాండ్ బ్లాక్ బస్టర్ మిరాయ్ కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.81.20 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి రికార్డు సృష్టించిందని’’ మేకర్స్ వసూళ్ల వివరాలు వెల్లడించారు.

మిరాయ్.. తొలి రోజు (సెప్టెంబర్12న) రూ.27 కోట్లు, రెండో రోజు రూ.55.6 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక మూడో రోజు సైతం వసూళ్లను కొనసాగిస్తూ.. 3 రోజుల్లోనే రూ.81.20 కోట్ల గ్రాస్‌ సాధించింది. ఇకపోతే, ఇండియా వైడ్గా రూ.44.75 కోట్ల నెట్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సక్నిల్క్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం: 

మిరాయ్ ఇండియాలో తొలిరోజు రూ.13 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు అంతకు మించిన వసూళ్లతో దూసుకెళ్లింది. శనివారం (సెప్టెంబర్ 13న) ఇండియాలో రూ.14.5 కోట్లు నెట్ సాధించి శభాష్ అనిపించుకుంది. మూడో రోజు రూ.16.25 కోట్ల నెట్ తో రెట్టింపు కలెక్షన్లతో సత్తా చాటుకుంది.

తెలుగులోనే అత్యధిక వసూళ్లు చేసింది. దాదాపు రూ.12.5 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. హిందీలో రూ.3.4 కోట్లు వచ్చాయి. ఇలా మూడ్రోజుల నెట్ వసూళ్లు చూస్తే.. ఇండియాలో రూ.44.75 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. అలాగే, ఓవర్సీస్ మార్కెట్లో సైతం మిరాయ్ రికార్డ్ వసూళ్లు రాబడుతోంది.