కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్.. ఫ్రెండ్లీఫైట్కు ఫుల్స్టాప్ పెట్టే దిశగా కాంగ్రెస్ అడుగులు

కూటమి సీఎం అభ్యర్థిగా  తేజస్వీ యాదవ్.. ఫ్రెండ్లీఫైట్కు ఫుల్స్టాప్ పెట్టే దిశగా కాంగ్రెస్ అడుగులు

పాట్నా: బిహార్ మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థిగా రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్​ను ప్రకటించే అవకాశాలున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్న ‘ఫ్రెండ్లీ ఫైట్’కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాజస్తాన్‌‌ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ హుటాహుటిన ఢిల్లీ నుంచి పాట్నా చేరుకున్నారు. సీట్ల సర్దుబాటు అంశంపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్​తో చర్చించారు. అయినప్పటికీ సీట్ల పంపకాల విషయం ఓ కొలిక్కి రాలేదు. ఇదిలా ఉండగా.. రాహుల్, తేజస్వీ యాదవ్ మధ్య మంచి ఫ్రెండ్​షిప్ ఉంది. 

బిహార్​లో మహాఘట్​బంధన్ సర్కార్​ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. సీఎం అభ్యర్థి ఎవరనేది తేల్చాల్సిందిగా ఆర్జేడీ పట్టుబడుతున్నది. కాంగ్రెస్ స్పందించకపోవడంతో కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య భేదాభిప్రాయాలు తెరమీదికి వచ్చాయి. దీనికితోడు కూటమిలోని పార్టీలు కొన్ని నియోజకవర్గాలలో ఒకరిపై ఒకరు పోటీకి దిగుతున్నాయి. దీంతో కూటమి ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. తామంతా ఒకటే అనే సందేశం పంపేందుకు తేజస్వీ యాదవ్‌‌తో గెహ్లాట్ సమావేశం కానున్నారు. వెంటనే ఈ అంతర్గత విభేదాలను పరిష్కరించి, తేజస్వీ యాదవ్ నాయకత్వంలో ముందుకు సాగాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇయ్యాలో.. రేపో.. కూటమి సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్​ను ప్రకటించే అవకాశాలున్నాయి.

ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించుతాం: గెహ్లాట్

దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ఎన్డీయేను ఓడిస్తామని రాజస్తాన్‌‌ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ స్పష్టం చేశారు. బిహార్ ప్రజలంతా మహాఘట్ బంధన్​కు మద్దతు ఇవ్వాలని కోరారు. సీట్ల షేరింగ్​పై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్​తో చర్చించాక.. ఆయన మీడియాతో మాట్లాడారు. బిహార్​లో నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రతో రాహుల్, తేజస్వీ మధ్య ఫ్రెండ్​షిప్ మరింత బలపడిందన్నారు. ఇద్దరూ కలిసి సరైన సమయంలో.. సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

జీవికా దీదీలను పర్మినెంట్ చేస్తం: తేజస్వీ

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లను పర్మినెంట్‌‌ చేయడంతో పాటు నెలకు రూ.30 వేల జీతం ఇస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వం అమలుచేస్తున్న ‘జీవికా దీదీ’ స్కీమ్​లోని లోపాలను చక్కదిద్ది, మహిళలకు అండగా ఉంటామన్నారు. జీవికా దీదీ మొబిలైజర్లు తీసుకున్న రుణాలపై వడ్డీని మాఫీ చేస్తామన్నారు. రూ.5లక్షల బీమా కవరేజీ, రాబోయే రెండేండ్లకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ప్రతి జీవికా దీదీకి నెలకు రూ.2 వేల అదనపు భత్యం ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు.