తెలంగాణ ప్రభుత్వానికి 1969 ఉద్యమకారుల వార్నింగ్..

తెలంగాణ ప్రభుత్వానికి 1969 ఉద్యమకారుల వార్నింగ్..

తెలంగాణ సాధన కోసం 1969 తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని 1969 తెలంగాణ  ఉద్యమకారుల సంఘం ఆరోపించింది.  తమ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్  3న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర 1969 ఉద్యమకారులతో మహాధర్నా చేపట్టనున్నట్లు  సంఘం అధ్యక్షులు చక్రహరి రామరాజు తెలిపారు.

తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమాలన్నింటిలో 1969 తెలంగాణ ఉద్యమమే కీలకమని చక్రహరి రామరాజు తెలిపారు. నాటి ఉద్యమంలో 369 మంది ఉద్యమకారులు పోలీస్ తూటాలకు  బలయ్యారని గుర్తు చేశారు. ఆనాటి ఉద్యమ స్ఫూర్తితోనే మలిదశ ఉద్యమం జరిగి నేడు తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేశారు. రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదిన్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ 1969 ఉద్యమకారులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1969 ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని అనేక మార్లు  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు విన్నవించినా... పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. 

ఇవే డిమాండ్లు..

 బిఆర్ఎస్ ప్రభుత్వం 1969 తెలంగాణ ఉద్యమ కారులను తెలంగాణ సమరయోధులుగా గుర్తించి గుర్తింపు కార్డులను ఇవ్వాలని చక్రహరి రామరాజు తెలిపారు.  ఉద్యమకారులందరికీ గౌరవప్రదమైన పెన్షన్ సౌకర్యం కల్పించాలని  కోరారు. చాలామంది ఉద్యమకారులు 70 సంవత్సరాలు పైబడి వివిధ ఆరోగ్య కారణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. వారికి ప్రభుత్వ, వైద్యశాలలో ఉచిత వైద్య సౌకర్యం కల్పించి, ఉచిత బస్ పాస్, గృహ వసతి కల్పించాలన్నారు.  పోలీస్ తూటాలకు బలైన 369 మంది  ఉద్యమకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ పార్టీ  ఉద్యమకారులకు 250 గజాల చొప్పున స్థలం ఇస్తామని ప్రకటించడం పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు. 

అక్టోబర్ 3వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరిగే మహాధర్నాకు బిఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నామని చక్రహరి రామరాజు తెలిపారు.  తమ డిమాండ్ లను వారి మేనిఫెస్టోలో  పెట్టిన పార్టీకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తమ ఓట్లతో బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.