4 నెలలు.. 85 కేసులు..92 మంది అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ

4 నెలలు.. 85 కేసులు..92 మంది అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు ఇయ్యనిదే పనిచేస్తలేరు. దీంతో ఏసీబీకి ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది 4 నెలల వ్యవధిలోనే 85 కేసులు నమోదుకాగా 92 మంది ఏసీబీకి చిక్కారు. గత నెలలో 21 కేసులు నమోదయ్యాయి. అందులో 13 ట్రాప్‌‌‌‌  కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. గతేడాది 152 కేసుల్లో 223 మందిని ఏసీబీ అరెస్టు చేసింది. అందులో 129 ట్రాప్‌‌‌‌ కేసుల్లో  200 మంది దొరికారు. ఇందులో 159 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 41 మంది ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌, ప్రైవేట్  వ్యక్తులు ఉన్నారు.

ఈ క్రమంలోనే అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. అవినీతిని నిర్మూలించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏసీబీ డీజీ విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌  ‌‌‌‌నేతృత్వంలో దూకుడు పెంచారు. అవినీతి అధికారులను వలవేసి పట్టుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోయింది. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌1064తో పాటు మెయిల్స్  ద్వారా కూడా ఆయా జిల్లాల ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. తెలంగాణ ఏసీబీ పేరుతో ఫేస్ బుక్, ఎక్స్  వేదికగా బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. 

పోలీసులే అత్యధికంగా

ఏసీబీకి పట్టుపడుతున్న వారిలో అత్యధిక శాతం పోలీస్  డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. తరువాతి స్థానాల్లో  రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌, బీసీ  వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌, సోషల్  వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ, ఫారెస్ట్‌‌‌‌, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్‌‌‌‌, పంచాయతీరాజ్‌‌‌‌ అండ్  రూరల్  డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌, రోడ్స్‌‌‌‌  అండ్  బిల్డింగ్స్‌‌‌‌, ఎంఏయూడీకి చెందిన ఉద్యోగులు, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌  సిబ్బంది ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు కలెక్షన్ల కోసం ప్రైవేట్  వ్యక్తులతో  పోలీసులు నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఏర్పాటు చేసుకున్నట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని అందినకాడికి వసూలు చేస్తున్న పోలీసులను అధికారులు వలవేసిపట్టుకున్నారు.