ఉద్యమకారుల ఊసేది?..బీఆర్ఎస్ మేనిఫెస్టోల్లో వారి సంక్షేమానికి దక్కని చోటు

ఉద్యమకారుల ఊసేది?..బీఆర్ఎస్ మేనిఫెస్టోల్లో వారి సంక్షేమానికి దక్కని చోటు
  • రాష్ట్రం వచ్చాక పార్టీతో కలిసి నడిచిన కొందరికే అవకాశాలు
  • ఉత్తరాఖండ్  ఉద్యమంలో పనిచేసినోళ్లకు సముచిత స్థానం ఇచ్చిన అక్కడి సర్కారు​ 
  • 7 రోజులకుపైగా జైల్లో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్
  • తాజాగా ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తామని కాంగ్రెస్ హామీ
  • మిగిలిన పార్టీలు కూడా తమ సంక్షేమంపై హామీ ఇవ్వాలంటున్న ఉద్యమకారులు

కరీంనగర్, వెలుగు : తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిదేండ్లు గడిచినా రాష్ట్రం కోసం కొట్లాడిన చాలా మంది ఉద్యమకారులకు బీఆర్ఎస్  హయాంలో గుర్తింపు లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రకటించిన గత రెండు మేనిఫెస్టోలతోపాటు ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టోలోనూ ఉద్యమకారుల సంక్షేమం గురించిన ప్రస్తావనే లేదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ తో కలిసి నడిచిన ఉద్యమకారుల్లో చాలా కొద్దిమందికి మాత్రమే వివిధ పదవుల్లో అవకాశాలు దక్కగా.. బీఆర్ఎస్ బయట ఉన్న చాలా మంది జేఏసీ లీడర్లకు, ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగా ఉన్న ఉద్యమకారులకు ఎలాంటి గౌరవం దక్కలేదు. ఉద్యమం సమయంలో సుమారు ఐదారేండ్ల పాటు మిలిటెంట్  పోరాటాలు చేసి కేసులపాలైన విద్యార్థులు, యువకులు  చాలా మంది ఇప్పటికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేక కాలం వెళ్లదీస్తున్నారు. 

ఉత్తరాఖండ్​లో ఉద్యమకారులకు గుర్తింపు

ఉత్తరాఖండ్  ప్రత్యేక రాష్ట్రంగా 2000లో ఏర్పడింది. 2004లో  అప్పటి ఎన్డీ తివారీ ప్రభుత్వం రాష్ట్ర సాధన కోసం పనిచేసిన ఉద్యమకారులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్  నిర్వహించే గ్రూప్ సీ, డీ, తదితర క్యాడర్  పోస్టుల్లో రిజర్వేషన్  కల్పించింది. ఉద్యమంలో చనిపోయినవారి కుటుంబ సభ్యులతో పాటు కేసులు నమోదై ఏడు రోజులకుపైగా జైల్లో ఉన్నవారిని ఈ రిజర్వేషన్లకు అర్హులుగా అక్కడి సర్కారు గుర్తించింది. మొదటి ఐదేళ్లే ఈ రిజర్వేషన్లు అమలులో ఉంటాయని చెప్పినా తర్వాత పొడిగించారు. కానీ, ఉద్యమకారుల పేరిట అడ్డగోలుగా రిజర్వేషన్లు ఇస్తున్నారంటూ ఈ విధానాన్ని హైకోర్టు నిలిపివేసింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్  సంయుక్త సంఘర్ష్  సమితి, ఉత్తరాఖండ్  రాజ్య ఆందోళన మంచ్  వంటి వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఉద్యమకారులు తరచూ ఆందోళనలు నిర్వహించారు. దీంతో  సీఎం పుష్కర్  సింగ్  ధామి ఈ అంశంపై మంత్రి సుబోధ్ ఉనియాల్  నేతృత్వంలో క్యాబినేట్  సబ్  కమిటీ ఏర్పాటు చేశారు. సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకు, వారిపై ఆధారపడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో హారిజంటల్  పద్ధతిలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పాస్ చేసింది. అలాగే వృద్ధాప్యంలో ఉన్న ఉద్యమకారులకు నెలకు రూ.6 వేల పెన్షన్  ఇస్తోంది. హాస్పిటల్స్ లో ఉచిత వైద్యం అందిస్తోంది.

ఉద్యమకాలంలో హాల్ టికెట్స్ చించేసిన స్టూడెంట్  లీడర్స్ 

ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గ్రూప్ 1, గ్రూప్ 2, వీఆర్వో, ఎస్సై, పీసీ తదితర పోస్టుల భర్తీకి నోటీఫికేషన్లు ఇస్తే తెలంగాణ వచ్చినాకే ఉద్యోగాలు తీసుకుంటామని విద్యార్థి ఉద్యమకారులు, విద్యార్థులు ఓయూ, కేయూతోపాటు తెలంగాణవ్యాప్తంగా హాల్ టికెట్లు చించేసి, పరీక్షలను బహిష్కరించారు. తీరా తెలంగాణ వచ్చాక టీఎస్ పీఎస్సీ ద్వారా భర్తీ అయిన సుమారు 33 వేల పోస్టుల్లో చాలా మంది ఉద్యోగాలు రాక రోడ్డున పడ్డారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేండ్లు గడుస్తున్నా, మూడోసారి ఎన్నికలకు వెళ్తున్నా రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో ఉద్యమకారులను ఆదుకునే హామీలకు చోటు దక్కడం లేదు. తాము అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్  పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇక 2014, 2018 మేనిఫెస్టోలతో పాటు తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్  మేనిఫెస్టోలోనూ ఉద్యమకారులకు ఎలాంటి హామీ దక్కలేదు. అలాగే బీజేపీ, ఇతర పార్టీలు తమ మేనిఫెస్టోలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికైనా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వారి మేనిఫెస్టోల్లో తమకు ఉద్యోగ, ఉపాధి, పెన్షన్, ఇతర సౌకర్యాలపై హామీలు ఇవ్వాలని, ఉద్యమకారుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఉద్యమకారులు డిమాండ్  చేస్తున్నారు. 

కేసీఆర్  కూడా సీమాంధ్రుల్లాగే పనిచేసిన్రు

తెలంగాణ ఉద్యమకారులకు స్వరాష్ట్రంలో అన్నీ అవమానాలే జరిగాయి. ప్రజల ఆకాంక్షలు వమ్ము అయ్యాయని ఉద్యమకారులు మూడు, నాలుగేళ్లుగా గళం విప్పుతున్నారు. ఉద్యమకాలంలో ఉద్యమకారులపై దాడులు చేసినోళ్లు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులయ్యారు. ఉద్యమకారులను, ప్రజలను బీఆర్ఎస్  ప్రభుత్వం పట్టించుకోలేదు. సీమాంధ్ర పాలకుల్లాగే తమ సామాజికవర్గం అభివృద్ధి కోసమే కేసీఆర్ పని చేశారు. కేసీఆర్  ప్రభుత్వానికి ఉద్యమ స్ఫూర్తి లేదు. ఉద్యమకారులను ఉద్యమానికే వాడుకున్నరు. ఆ తర్వాత కేసీఆరే తమది ఉద్యమ పార్టీ కాదు.. ఫక్తు రాజకీయ పార్టీ అని డిక్లేర్  చేసిండు. ఉద్యమకారులను ఏనాడూ గౌరవించలేదు. ఉద్యమ కాలంలో విద్యార్థి, యువ నాయకులుగా ఉన్నవాళ్లు దాదాపు 20 ఏళ్ల జీవితాన్ని కోల్పోయారు. మూడోసారి ఎన్నికలకు వెళ్లే ముందైనా బీఆర్ఎస్  ఉద్యమకారులను గుర్తించాల్సింది. ఇప్పటికైనా జైళ్లకు పోయినోళ్లు, కేసులు ఉన్నోళ్లు, పోలీసుల చేతిలో గాయపడినోళ్లను గుర్తించి ఫ్రీడం ఫైటర్లకు ఇస్తున్నట్లుగానే గౌరవ భృతి ఇవ్వాలి. 

 –  ప్రొఫెసర్  కూరపాటి వెంకటనారాయణ, తెలంగాణ ఉద్యమకారుల వేదిక, కన్వీనర్ 

ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి

2009 నుంచి 2014 వరకు ఐదేండ్ల పాటు సాగిన మలిదశ ఉద్యమంలో విద్యార్థులే కీలకపాత్ర పోషించారు. అప్పటి సీఎం కిరణ్  కుమార్  రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి జాబ్  నోటిఫికేషన్లు వేస్తే తెలంగాణ రాష్ట్రంలోనే పరీక్షలు రాస్తామని బహిష్కరించినం. కానీ, రాష్ట్రం వచ్చాక విద్యార్థి ఉద్యమ నాయకులంతా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. బీఆర్ఎస్ తో ఉన్న కొందరికి మాత్రమే పదవులు ఇచ్చారు. మిగతా విద్యార్థి నాయకులను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికైనా మాలాంటి ఉద్యమకారులకు న్యాయం చేయాలి. ఉత్తరాఖండ్  తరహాలో ఉద్యమకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్  కల్పించాలి. 

– డాక్టర్ సూత్రపు అనిల్, కేయూ విద్యార్థి జేఏసీ మాజీ నేత