
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీని ఒకే జిల్లాగా మార్పు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ కన్వీనర్ పుల్లూరు సుధాకర్ డిమాండ్ చేశారు. బుధవారం రెండు జిల్లాలకు చెందిన ప్రజాసంఘాల ప్రతినిధులతో కలిసి వరంగల్ గ్రేటర్ ప్రెస్‍క్లబ్‍లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వరంగల్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, యువత ఆశించిననట్టు చెప్పారు.
నాటి సీఎం కేసీఆర్ వరంగల్ సిటీని అశాస్త్రీయంగా ముక్కలు చేశాడని, ఈ ప్రాంత ఉనికి, అభివృద్ధిని అణగదొక్కేలా చేశాడని మండిపడ్డారు. అజంజాహి భూములను అమ్మకానికిపెట్టి రియల్ వ్యాపారం చేశాడని ఆరోపించారు. కాకతీయ యూనివర్సిటీ, ఎల్‍బీ కాలేజీ, సీకేఎం కాలేజీ వంటి విద్యా కేంద్రాలు నిర్లక్ష్యానికి గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ సిటీని వరంగల్ జిల్లాగా మార్పు చేసి నాగ్ పూర్, పుణె, కోయంబత్తూర్, వైజాగ్, హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయకుంటే.. ఈ ప్రాంతం ఏడారిగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యమకారుల ఐక్యవేదిక కన్వీనర్ సోమ రామమూర్తి, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, రెడ్‍క్రాస్ నేతలు బొమ్మినేని బాపిరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యామ్ యాదవ్, ప్రజా సంఘాల నేతలు వీరమల్ల బాబురావు, యాదగిరి పాల్గొన్నారు.