న్యాయ వ్యవస్థ పై విశ్వాసం పెంచేందుకే రక్షణ బిల్లు : బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నరసింహా రెడ్డి

న్యాయ వ్యవస్థ పై విశ్వాసం పెంచేందుకే రక్షణ బిల్లు : బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నరసింహా రెడ్డి
  •     బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ నరసింహారెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ, రక్షణ బిల్లు న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతుందని బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి అన్నారు. న్యాయవాదుల రక్షణ, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లును స్వాగతిస్తున్నామని తెలిపారు. బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ కార్యాలయంలో గురువారం సభ్యులు కొల్లి సత్యనారాయణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. న్యాయవాదులతోపాటు వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం ముసాయిదా బిల్లును తీసుకురావడం అభినందనీయమన్నారు. 

ఈ బిల్లు న్యాయవాదుల నైతిక స్థైర్యాన్ని పెంచుతుందని చెపారు. న్యాయవాదులు చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు పెట్టినట్లు తేలితే వారికీ శిక్ష విధించాలని తెలిపారు. ఈ బిల్లులో సంక్షేమాన్ని కూడా కలపడం కాస్త ఇబ్బందికరంగా ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న న్యాయవాదుల సంక్షేమ నిధి ట్రస్ట్‌ బిల్లులో విలీనం చేశారని, అలా కాకుండా ఈ బాధ్యతను బార్‌ కౌన్సిల్‌కు అప్పగిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.